స్కూళ్లో టీచర్.. విద్యార్థిని.. ‘ఏరా.. వాడి పెన్సిల్ తీసుకున్నావా’ అని అడిగితే.. అందుకు ఆ విద్యార్థి.. ‘దేవుడి సాక్షిగా నాకేపాపం తెలియదు మేడం.. నేను తీసుకోలేదు’ అంటాడు. ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదు అనేది ఆ విద్యార్థి ఉద్దేశం. అబద్ధం చెబితే దేవుడు శిక్షిస్తాడనేది అతడి నమ్మకం. మరి ఆ ఉద్దేశాలు, నమ్మకాలు వాడు పెరిగి పెద్దయ్యే వరకు ఉంటున్నాయా? అంటే.. కచ్చితంగా ఉండవనే చెప్పొచ్చు. చిన్నప్పుడు ఉన్న నిజాయితీ.. పెరిగే కొద్దీ ఎందుకు సన్నగిల్లుతోంది? సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, కొందరు చేస్తున్న దొంగ ప్రమాణాలు మనల్ని అలా తయారు చేస్తున్నాయి. ఇక విషయంలోకి వస్తే.. ఏపీలో ప్రస్తుతం ప్రమాణాల రాజకీయం నడుస్తోంది. చిన్న విషయం దగ్గర నుంచి హత్యకేసుల వరకు ప్రమాణాలతోనే సరిపుచ్చేస్తున్నారు. ఇరు పక్షాలూ ప్రమాణాల సవాళ్లు విసురుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరు పక్షాలూ ప్రమాణాలు చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో అధికార పక్షం ముఖం చాటేస్తోంది.
అనపర్తిలో మొదలై.. ప్రొద్దుటూరు వరకు..
ముందుగా ఈ ప్రమాణాల సవాళ్లకు తెరతీసింది అనపర్తి రాజకీయమే. అవినీతిపై మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా ముదిరి.. ప్రమాణాల సవాల్‌కు దారితీసింది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి ప్రతిగా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే అవినీతికి పాల్పడ్డారంటూ సూర్యనారాయణరెడ్డి ప్రత్యారోపణ చేశారు. ఈ విషయమై ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చివరికి వైసీపీ ఎమ్మెల్యే.. బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణం చేయాలంటూ రామకృష్ణారెడ్డికి సవాల్ విసిరారు. ఈ సవాల్ ను ఆయన స్వీకరించారు. దీంతో.. ఇరువురు నేతలూ గణపతి ఆలయంలో ప్రమాణం చేశారు.
అక్కడ మొదలైన ఈ ప్రమాణాల పర్వం.. వైజాగ్‌కు పాకింది. అక్కడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూకబ్జా దారుడంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. అతడు కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. దీనిపై స్పందించిన వెలగపూడి.. ప్రభుత్వ స్వాధీనం చేసుకున్న భూమి తనది కాదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయిపై విరుచుకుపడ్డారు. ఆర్థిక నేరాల్లో ఏ2గా ఉన్న వ్యక్తికి తనను విమర్శించే అర్హత లేదన్నారు. దమ్ముంటే.. తన ఇష్ట దైవం సాయిబాబా గుడికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. కానీ, ఈ సవాల్ కు విజయసాయి ముఖం చాటేశారు. బహుశా..! ఆయన కూడా సాయి భక్తుడేనేమో! కానీ, అక్కడి స్థానిక వైసీపీ నేతలు మాత్రం దీనిపై హైడ్రామాకు తెరతీశారు. ఆ గుడికి.. స్థానిక వైసీపీ ఇన్చార్జి సహా కార్యకర్తలు భారీగా చేరుకుని ప్రమాణాలు చేశారు. రామకృష్ణ బాబును కూడా రమ్మంటూ సవాల్ విసిరారు. దీనిపై రామకృష్ణబాబు అసహనం వ్యక్తం చేశారు. ‘తాను విజయసాయికి సవాల్ విసిరితే.. ఆయన ముఖం చాటేశాడు. మరి వీళ్లంతా ఎవరు? దమ్ముంటే ఆయన్ని రమ్మనండి’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో ఇంకా సవాళ్లు, ప్రతి సవాళ్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.
హత్య కేసుకూ ప్రమాణంతోనే సరా..!
ఇప్పుడు తాజాగా ప్రొద్దుటూరులో ఓ ఏకపక్ష ప్రమాణం జరిగింది. అదీ.. ఓ దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చేసిన ప్రమాణం. సంచలనం సృష్టించిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. తనకే పాపమూ తెలియదంటూ స్థానిక చౌడేశ్వరి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ప్రమాణం చేయాల్సిందిగా ఆయనకు ఎవరూ సవాల్ విసరలేదు. ఆయనే స్వచ్ఛందంగా వెళ్లి ప్రమాణం చేశారు. బహుశా.. ఈ ప్రమాణం ఆధారంగా ఆయన్ను పోలీసులు ఈ కేసు నుంచి తప్పిస్తారేమో! ఇలా ప్రమాణం చేసినోళ్లంతా నిర్దోషులైపోతే.. ఇక కోర్టులెందుకు? చట్టాలెందుకు? భవిష్యత్తులో ఇలాంటి చట్టం తెచ్చినా తెస్తారు మన జగనోరు! ఇప్పటికే అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయి.. బెయిలు మీద బయట తిరుగుతున్న మన జగనోరు.. వీటి బారి నుంచి విముక్తి పొందేందుకు చేయని యత్నం లేదు. ఢిల్లీ పెద్దల కాళ్లు మొక్కుతూ.. వారి అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇలాంటి చట్టమేదో చేసేసుకుని కేసుల నుంచి బయటపడదామని ఆలోచించినా ఆలోచిస్తారు! ఎందుకంటే.. ఆయన జగనన్న కదా! మంచి ఎవరు చెప్పినా వినరు.
దేవుడికే రక్షణ లేని చోట.. దైవ ప్రమాణాలెందుకో!
ప్రమాణాలు చేయడానికి ఒకరిద్దరు నాయకులు భయపడుతున్నా.. అధిక శాతం అధికార పక్ష నాయకులు.. ఏ మాత్రం లెక్కచేయడం లేదు. బహుశా.. వారికి దేవుడంటే భయం లేదేమో! లేకపోతే.. ఒటర్లకు చేసిన ప్రమాణాలే తప్పుతున్నప్పుడు.. ఇదెంతలే అనుకుంటున్నారో మరి! రాష్ట్రంలో తనను తానే రక్షించుకోలేని ఈ బలహీన దేవుడు.. మనల్నేం చేస్తాడులే అన్న ధీమా కూడా అయి ఉండొచ్చు! నిజమే కదా..! ఇక్కడ వైసీపీ నాయకుల అరాచకాలకు దేవుడు కూడా బాధితుడే! రోజుకో విగ్రహం.. వారానికో ఆలయం.. ధ్వంసం అవుతూనే ఉన్నాయి. దేవుడు కూడా ఏం చేయలేకున్నాడు. అందుకేనేమో మన వైసీపీ నాయకులు వరుసగా ప్రమాణాల బాట పడుతున్నారు.
ఇక చివరగా.. కోర్టుల విషయానికి వద్దాం. కోర్టులో సాధారణంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పమంటారు. అక్కడ ఇరు పక్షాలూ ఈ ప్రమాణం చేస్తాయి. మరి తీర్పేమో ఓ పక్షానికే అనుకూలంగా వస్తుంది. దీనర్థం.. రెండో పక్షం భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పినట్టేగా! మరి కోర్టు వారిని ఎందుకు శిక్షించదో! ఇదే సూత్రం.. దేవుడు కూడా పాటిస్తున్నట్టున్నాడు. తన దగ్గర ప్రమాణం చేసే ఇరు పక్షాల్లో ఒక్కరే నిజం చెబుతున్నట్టు. ఈ విషయం ఆయనకు పక్కాగా తెలుసు. మరి ఆ అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎందుకు శిక్షించడో! ఆయనకే తెలియాలి. ఎప్పుడైతే.. కోర్టులు, దేవుళ్లు.. తమ దగ్గర అబద్ధం చెప్పిన వాళ్లను శిక్షించడం మొదలెడతారో.. అప్పటికి ఆగుతుంది ఈ ప్రమాణాల గోల! అప్పటివరకు కొందరికి విసుగు తెప్పిస్తూ.. మరికొందరికి వినోదాన్ని పంచుతూ.. అలా సాగిపోతూనే ఉంటుంది ఈ రాజకీయ క్రీడ.
Also Read: రామతీర్థం పేరుతో రచ్చ : వైసీపీ vs టీడీపీ