ఐపీఎల్ కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మిగతా దేశాల లీగ్స్ కంటే ఐపీఎల్ లీగ్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 2008లో మొదలైన ఈ ఐపీఎల్ ఇప్పటి వరకు విజయవంతంగా 12 సీజన్లు పూర్తి చేసుకుంది. షెడ్యూలు ప్రకారం 13వ సీజన్ ఏప్రిల్ నెలలో మొదలు కావలసివుంది. కానీ కరోనా కారణంగా ఈ సీజన్ సమ్మర్ లో ప్రారంభం కాలేదు. ఈ మహమ్మారి ప్రభావంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ప్రపంచ కప్ ను వాయిదా వేసింది. దీంతో ఐపీఎల్ ను సెప్టెంబర్ లో జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కరోనా కలకలం రేపుతుండటంతో ఈ సీజన్ ను దుబాయ్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఫ్రాంచైజీలను ఒప్పించిన బీసీసీఐ ఈ సీజన్ షెడ్యూలును విడుదల చేసింది. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రేక్షకులను, మీడియాలకు అనుమతి లేదని బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో కరోనా సమయంలో ఈ టోర్నీ విజయవంతమవుతుందా? కాదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో కొందరు ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడటం మరి కొందరు టోర్నీకి దూరం కావడంతో 13వ సీజన్ పై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాల మధ్య సెప్టెంబర్ 19న ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్,. చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.
సరికొత్త రికార్డు
ఐపీఎల్-20పై నెలకొన్న అనుమానాలకు బ్రేకులు వేస్తూ ఈ సీజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ముంబై-చెన్నై మ్యాచును వరల్డ్ వైడ్ గా 20 కోట్ల మంది వీక్షించారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలియచేస్తూ ట్వీట్ చేశారు. బార్క్ సర్వేలో ఇది తేలిందని తెలిపారు. ఓపెనింగ్ డే రోజున ఈ రేంజ్ లో వ్యూయర్ షిప్ రావడం ఓ అరుదయిన ఫీట్. ఇలాంటి ఫీట్ ఏ దేశంలోనైనా ఏ లీగ్ లోనైనా ఇప్పటి వరకు జరగలేదంటూ వెల్లడించారు. ఐపీఎల్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, స్టార్ టీవీ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్, డిస్నీ ప్లస్ లకు ట్యాగ్ చేశాడు.
సుదీర్ఘ కాలం తరువాత క్రికెట్ మ్యాచులు మొదలు కావడంతో 20 కోట్ల వ్యూస్ వచ్చాయని క్రీడా వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో 437 రోజుల తరువాత ధోని క్రీజులోకి అడుగుపెట్టడం కూడా ఒక కారణమంటూ మేధావులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ టోర్నీ ఏ అడ్డంకులు లేకుండా విజయవంతం కావడంతో బీసీసీఐ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ కామెంట్ గురించి చెప్పక తప్పదు. ‘ఐపీఎల్ అభిమానులు స్టేడియంలోనే లేరు కానీ ప్రపంచమంతా ఉన్నారు’ అనే కామెంట్ విజయవంతమైన ఈ టోర్నీకి యాప్ట్ అవుతుంది.
Opening match of #Dream11IPL sets a new record!
As per BARC, an unprecedented 20crore people tuned in to watch the match. Highest ever opening day viewership for any sporting league in any country- no league has ever opened as big as this. @IPL @SGanguly99 @UShanx @DisneyPlusHS
— Jay Shah (@JayShah) September 22, 2020











