పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. రేపు ఓ ‘లాయర్ సాబ్’ ట్రైలర్ కూడా రాబోతోంది. ఎవరీ లాయర్ సాబ్? ఆయన పవర్ స్టార్ అయితే ఈయన ఎవర్ స్టారా? పవర్ స్టార్ ను ముట్టుకుంటే షాక్ కొడుతుందని ఈ ఎవర్ స్టార్ కు తెలియదా? మరి ఎందుకీ ప్రయత్నాలు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రేపటిదాకా ఆగనవసరం లేదు. బహుశా పవర్ స్టార్ కోసమే ఈ ఎవర్ స్టార్ ముందుకొస్తున్నాడేమో. మన దగ్గర ఆ సమాచారం కూడా ఉంది. వకీల్ సాబ్ ఈ నెల 9న విడుదల కాబోతోంది. అలాంటప్పుడు ఈ లాయర్ సాబ్ లాంటి కొత్త జాబ్ చేపట్టాల్సిన అవసరం ఎస్. కె. ఫిలిమ్స్ కు ఏమొచ్చిందో.
ఈ బ్యానర్ మరెవరిదో కాదు ‘సంతోషం’ సురేష్ గా పిలిచే సురేష్ కొండేటిది. ప్రేమిస్తే, జర్నీలాంటి చిత్రాలను నిర్మించిన ఆయన తాజాగా షకలక శంకర్ హీరోగా ‘టు ప్లస్ ఒన్’ అనే సినిమా చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ తరుణంలో ‘లాయర్ సాబ్’లాంటి కొత్త సినిమా ప్రకటిస్తున్నారు అనుకోడానికి వీల్లేదు. స్ఫూఫ్ లు చేయడంలో షకలక శంకర్ దిట్ట అనే సంగతి అందరికీ తెలిసిందే. రాంగోపాల్ వర్మను అనుకరించడంలోనూ అతనికి అతనే సాటి. అలాంటి షకలక శంకర్ తో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పాత్రను రీక్రియేట్ చేసే అవకాశం ఉంది.
సురేష్ కొండేటి కూడా నటుడే. ఇటీవలే ‘దేవినేని’ చిత్రంలో వంగావీటి రంగా పాత్రను పోషించారు. ఒకవేళ తనకు ఇలాంటి పాత్రను పోషించాలన్న కోరికతో ఈ లాయర్ సాబ్ ను జనం ముందుకు తీసుకువచ్చే అవకాశం కూడా ఉంది. షకలక శంకర్ లేదా సురేష్ కొండేటిలో ఎవరో ఒకరు రేపు ఈ ‘లాయర్ సాబ్’ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది మాత్రం సుస్పష్టం. దీనికి నిర్మాత, క్రియేటివ్ దర్శకుడు కూడా తనేనని సురేష్ కొండేటి అధికారికంగా ప్రకటించేశారు. విడుదల చేసిన పోస్టర్ లో లాయర్ సాబ్ పాత్రధారిని వెనక నుంచి చూపించారు. అది షకలక శంకర్ కావడానికే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఈ లాయర్ సాబ్ ప్రయత్నం వికటిస్తే మాత్రం షకలక శంకర్ కాస్తా పవర్ స్టార్ అభిమానుల కోపానికి గురై లకలక శంకర్ అవుతాడేమో. ఏం జరుగుతుందో రేపు చూద్దాం.