విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో ఉన్న వరవరరావును తక్షణం ముంబాయిలోని నానావతి ఆసుపత్రికి తరలించాలని బాంబే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం నానావతి ఆసుపత్రికి తరలించారు. ఆయితే ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఆయన నరాల సంబంధమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారని, దీనికి తోడు ఈ ఏడాది ఆయనకు జైలులో కరోనా సోకిందని వరవరరావు తరపు న్యాయవాది ముంబయి హైకోర్టుకు తెలిపారు.
కోవిడ్ అనంతరం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉన్నా, జైలు అధికారులు అలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాదించారు. 81 సంవత్సరాల వృద్ధుడు, తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే ఇప్పటికీ జైల్లోనే ఉంచాలా? అంటూ బొంబాయి హైకోర్టు, ఎన్ఐఏ తరపున వాదనలు విపిపించిన సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించింది. వెంటనే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందించాలని ముంబయి హైకోర్టు ఆదేశించింది. వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని, ఆయనకు తోడుగా ఉండేందుకు ఆయన భార్యను అనుమతించాలని కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టుకు చెప్పకుండా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయవద్దు, వైద్య రిపోర్టులు కూడా కోర్టుకు సమర్పించాలని ముంబయి హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వరవరరావును ఎందుకు అరెస్టు చేశారంటే?
చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2018లో అరెస్టై మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో ఉన్న వరవరరావుకు రెండేళ్ల నుంచి బెయిల్ లభించడంలేదు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, వెంటనే నానావతి ఆసుపత్రికి తరలించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక బెయిల్ విషయం విచారించేందుకు కోర్టు డిసెంబరు మూడో తేదీకి వాయిదా వేసింది. 2017 డిసెంబరు 31న పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సదస్సులో పాల్గొన్నందుకు వరవరరావును ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరికి నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ వరవరరావును అదుపులోకి తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీని చంపించడానికి వీరంతా కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Must Read ;- వరవరరావును ఆస్పత్రిలో చేర్చండి : ప్రభుత్వానికి ఆదేశం











