విప్లవ కవి వరవరరావు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యుల పిటిషన్ మేరకు ఆయనను తక్షణం ముంబాయిలోని నానావతి ఆస్ప్రత్రిలో చేర్పించాలని, ప్రభుత్వ ఖర్చులతో చికిత్స ఇప్పించాలని ముంబాయి హైకోర్టు ఆదేశించింది.
భీమా కోరేగావ్ ప్రభుత్వ వ్యతిరేక కుట్ర కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ వరవరరావు.. రెండేళ్లుగా జైల్లోనే గడుపుతున్నారు. ఆయనకు బెయిల్ కోసం ఇప్పటికే అనేక దఫాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారీ పోలీసులు బెయిల్ పిటిషన్ కు అడ్డు పడుతున్నారు. జైల్లో ఉండగానే ఆయనకు కరోనా కూడా సోకింది. కరోనా చికిత్స ఇప్పించి మళ్లీ జైలుకు తరలించారు. నాణ్యమైన చికిత్స అందించడం లేదని, కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వకుండా చేస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి.
అయితే, 80 ఏళ్ల వరవరరావు ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు చికిత్స ఇప్పించడం లేదంటూ భార్య కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె తరఫున ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఆయన అనారోగ్యం తీవ్రతను గుర్తించిన హైకోర్టు.. బుధవారం నానావతి ఆస్పత్రికి తరలించి 15 రోజుల పాటు చికిత్స ఇప్పించాల్సిందిగా ఆదేశించింది. ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. కోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఆయనను విడుదల చేయడానికి కూడా వీల్లేదని పేర్కొంది.
Must Read: అనారోగ్యంతో టాలీవుడ్ కమెడియన్ కన్నుమూత











