బాలయ్య వచ్చేశాడు… రికార్డులు తెచ్చేశాడు. సంక్రాంతి సీజనులో విడుదలైన బాలయ్య సినిమాలు ఎన్నో రికార్డులు కొల్లగొట్టాలయి. ఈసారి వీరసింహారెడ్డిగా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో ముడిపడిన కథ. విలన్ ప్రతాపరెడ్డి తన తండ్రిని చంపిన వీరసింహారెడ్డిపై పగ తీర్చుకోవడానికి ప్రయత్నించే సన్నివేశంతోనే సినిమా ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కథ ఇస్తాంబుల్ కు వెళుతుంది. అక్కడ జయసింహారెడ్డి (బాలకృష్ణ) తన తల్లితో కలిసి ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. ఓ పబ్ లో పరిచయమైన ఈషా (శ్రుతి హాసన్)తో పెళ్లి నిశ్చయం అవుతుంది. అప్పటిదాకా జయ్ కి తన తండ్రి చనిపోయాడని అనుకుంటుంటాడు. కానీ అప్పుడే తల్లి అతని తండ్రి గురించి చెబుతుంది. రాయలసీమలో జయ్ తండ్రి వీరసింహారెడ్డి పెద్దాయన పేరుతో చలామణి అవుతుంటాడు. సీమ ప్రాంతానికి అతను రక్షణ కోట లాంటి వాడు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ప్రతాపరెడ్డి తండ్రిని చంపాల్సి వస్తుంది. అప్పట్నుంచి ప్రతాపరెడ్డి (దునియా విజయ్) వీరసింహారెడ్డిని చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొడుకు పెళ్లి కోసమని వీరసింహారెడ్డి ఇస్తాంబుల్ వస్తాడు. అక్కడ అతడి మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. వీరసింహారెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడా లేదా? ఆ తర్వాత పరిణామాలు ఏమిటి ? అన్నదే ప్రధానమైన కథ. చివరికి ఏం జరిగిందో తెరపైనే చూడాలి.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఇది సెంటి మెంటుతో కూడిన కథ. ఈ కథకు నూటికి నూరు శాతం న్యాయం చేయడంలో మలినేని గోపీచంద్ సక్సెస్ అయ్యాడు. వీరసింహారెడ్డిగా బాలయ్యను ఓ రేంజ్ లో చూపాడనే చెప్పాలి. ముఖ్యంగా వీరసింహారెడ్డి ప్రత్యర్థులతో తలపడే సన్నివేశాలు, హోంమంత్రితో భేటీ అయినప్పుడు పలికే డైలాగులు, పతాక సన్నివేశాల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటన.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్స్ గా చెప్పాలి. విలన్ పాత్రకు దునియా విజయ్ కూడా న్యాయం చేశాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు మామూలుగా లేవు. సినిమా ప్రథమార్థమంతా యాక్షన్ నేపథ్యంలో, ద్వితీయార్థం సెంటిమెంట్ ముడిపడి కథ ముందుకు సాగింది. డైలాగులు మాత్రం డైనమైట్స్ లా పేలిపోయాయి.
సినిమా ప్రథమార్థంలో ఓ ఇరవై నిమిషాలు కథ విసుగు తెప్పించినా వీరసింహారెడ్డి పాత్ర తెరపై కనిపించే సరికి కథనంలో వేగం పెరిగింది. బాలయ్యకు ఇలాంటి పాత్ర కొత్త కాకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. తండ్రీకొడుకులుగా ఆయన నటన పతాక స్థాయిలో ఉంది. అలాగే అతని చెల్లెలుగా వరలక్ష్మీ శరత్ కుమార్ పోటీపడి నటించింది. సినిమాకి ఆయువుపట్టు ఈ రెండు పాత్రలే. కథనం స్లోగా సాగినా ఎమోషన్ సన్నివేశాలను పండించడంలో మలినేని గోపీచంద్ వాహ్వా అనిపించాడు. దీనికి తమన్ రీరికార్డింగ్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. కొన్ని సన్నివేశాలు అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయి.
వీరసింహారెడ్డి పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన నటన కూడా నభూతోనభవిష్యతి అని చెప్పాలి. మాస్ కు మంచి మసాలా చిత్రంగా చెప్పాలి. నందమూరి బాలకృష్ణకు సరైన పాత్ర పడితే ఎలా చెలరేగిపోతాడో మరోసారి రుజువైంది. తండ్రి పాత్ర ముందు యంగ్ బాలయ్య పాత్ర తేలిపోయింది. హీరోయిన్లు శ్రుతి హాసన్, హనీరోజ్ల నటన బాగుంది. సాయిమాధవ్ బుర్రా డైలాగులు మాత్రం పేలాయి. పాటలు బాగున్నాయి. బాలయ్య అభిమానులకు అంతకంటే ఏం కావాలి?
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ – హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, రవిశంకర్, అజయ్ ఘోష్, సప్తగిరి తదితరులు.
సంగీతం: తమన్
కెమెరా: రిషి పంజాబి
మాటలు: బుర్రా సాయిమాధవ్
నిర్మాతలు: వై. రవిశంకర్ – నవీన్ ఎర్నేని
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మలినేని గోపీచంద్
ఒక్క మాటలో: వీరశివాలెత్తించాడు
రేటింగ్ – 4/5