అనిల్ రావిపూడి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా సాగిన ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఇటు వెంకటేశ్ .. అటు వరుణ్ తేజ్ కెరియర్ లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఇక దర్శకుడిగా ఈ సినిమా అనిల్ రావిపూడి క్రేజ్ ను అమాంతంగా పెంచింది. ఆయన వరుస విజయాలకు మరింత ఊతాన్నిచ్చింది. ఈ కారణంగానే ఈ సినిమాకి సీక్వెల్ గా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ ప్రాజెక్టు, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.
‘ఎఫ్ 2’ సినిమాలో చేసిన నటీనటులే సీక్వెల్ లోను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ – సారథీ స్టూడియోలో జరుగుతోంది. రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. కమెడియన్ శ్రీనివాసరెడ్డి కాంబినేషన్లోని ఒక కామెడీ సీన్ ను ఈ రోజున చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ కామెడీ సీన్ ఇంటర్వెల్ కి ముందుగా వస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టుఉంది. ఆయన నుంచి ఇంతవరకూ వచ్చిన సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. అలాగే ఈ సినిమాలోనూ కామెడీ పుష్కలంగా ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం వెంకటేశ్ ‘నారప్ప‘ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా రూపొందుతున్న ‘గని’ సినిమాతో వరుణ్ తేజ్ బిజీ. అందువలన ఈ ఇద్దరూ ఆ ప్రాజెక్టులను పూర్తిచేయగానే ‘ఎఫ్ 3’ షూటింగు ఊపందుకుంటుందని అంటున్నారు. ‘ఎఫ్ 2’ను మించిన వినోదాన్ని ‘ఎఫ్ 3’ అందిస్తుందని అనిల్ రావిపూడి చెప్పడం వలన, సహజంగానే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలోకి మరో హిట్ చేరిపోతుందేమో చూడాలి.
Must Read ;- విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?