స్టార్ హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టిపెడుతున్నారు. దర్శక నిర్మాతలంతా కూడా అలాంటి సినిమాలవైపే మొగ్గు చూపుతున్నారు. పాన్ ఇండియా సినిమాలకి భారీతనమే ప్రధామైన లక్షణం .. ప్రధానమైన ఆకర్షణ. అందువలన సత్తా కలిగిన దర్శకులకు .. స్టార్ హీరోలకు ఒక రేంజ్ లో పారితోషికాలు పెరిగిపోయాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. అందుకోసం ఇతర సినిమాలను వదులుకోవలసి ఉంటుంది. ఆ మందం రాబట్టుకోవాలంటే పారితోషికం పెంచకతప్పదనేది వారి ఆలోచన.
ఇక పాన్ ఇండియా సినిమాలు వివిధ భాషల్లో విడుదలవుతాయి .. భారీమొత్తంలో వసూళ్లు రాబడతాయి. అందువలన తాము పారితోషికం ఎక్కువ తీసుకోవడంలో తప్పులేదనేది మరో ఆలోచన. ఈ కారణాలుగా అటు దర్శకులకు .. ఇటు మార్కెట్ ఉన్న హీరోలకు అడిగినంత పారితోషకం ఇవ్వడానికి పెద్ద నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’ హీరో ‘యష్’ పారితోషికం గురించిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆయన పారితోషికం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
‘యష్ హీరోగా గతంలో వచ్చిన ‘కేజీఎఫ్‘ సంచలన విజయాన్ని సాధించింది .. రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ రూపొందుతోంది. కన్నడ .. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకిగాను యష్ కి ఎంత పారితోషికం ముట్టి ఉంటుంది? అనేది చర్చలకి రావడం సహజం. ఈ సినిమా కోసం యష్ కి 30 కోట్లవరకూ పారితోషికం ముట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు లాభాల్లో కొంతవాటా కూడా దక్కేలా మాట్లాడుకున్నాడని అంటున్నారు. కథలో బంగారుగనుల సంగతేమోగానీ, యష్ కి మాత్రం ఈ ప్రాజెక్టు ‘బంగారు గని’లా మారిందనే చెప్పొకోవాలి.
Must Read ;- వారాహి వారి చేతికే ‘కేజీఎఫ్ 2’ తెలుగు హక్కులు?