Vice President Venkaiah Naidu Shed A Tear In The Rajya Sabha :
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎన్నడూ లేనంత రీతిలో గందరగోళంగా కొనసాగాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనది మొదలు ఇటు దిగువ సభ లోక్ సభతో పాటు అటు ఎగువ సభ రాజ్యసభలోనూ పలు పార్టీలకు చెందిన సభ్యులు నిరసనల పర్వాన్ని కొనసాగించారు. ఈ నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క అంశంపైనా చర్చ జరగలేదనే చెప్పాలి. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన ఓబీసీ బిల్లుకు మాత్రం నిన్న లోక్ సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో దాదాపుగా సభ్యులంతా సీనియర్లే ఉంటారు. అంతేకాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారు. ఇక ఆయా పార్టీల నుంచి సీనియర్ మోస్ట్ నేతలే రాజ్యసభకు వస్తారు. ఈ క్రమంలో లోక్ సభ కంటే రాజ్యసభలో వ్యవహారాలు హుందాగా నడుస్తాయన్న అభిప్రాయం ఉంది. అయితే ఈ దఫా సమావేశాల్లో లోక్ సభను మించి రాజ్యసభలో నిరసనలు హోరెత్తాయి. వీటిని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రారంభించగా.. అన్ని పార్టీల సభ్యులూ ఆయన బాటలోనే నడిచారు.
భావోద్వేగం.. ఆపై కంటతడి..
రాజ్యసభలో మంగళవారం నాడు విపక్షాలు తమదైన శైలిలో నిరసన తెలిపాయి. ఇందులో భాగంగా మంగళవారం నాడు సీట్లలో నుంచి లేచి పోడియాన్ని చుట్టుముట్టిన కొందరు సభ్యులు.. ఏకంగా రాజ్యసభ సిబ్బంది ముందు ఉండే బల్లలపై నిలబడ్డారు. మరికొందరు వాటిపై కూర్చున్నారు. ఈ దృశ్యాలు రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిని తీవ్రంగా కలచివేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం నాటి ఈ దృశ్యాలను బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా గుర్తు చేసిన వెంకయ్య.. భావోద్వేగానికి గురయ్యారు. సభ్యులు నిరసన తెలిపిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఏకంగా కంట తడి పెట్టారు. ఇలా రాజ్యసభలో చైర్మన్ సీట్లో కూర్చున్న వెంకయ్య కంటతడి పెట్టిన వైనం సభ్యులతో పాటు యావత్తు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. సభ్యుల ప్రవర్తనను వివరించిన సందర్భంగా వెంకయ్య ఒక్కసారిగా కంట తడిపెట్టారు.
సాయిరెడ్ది నిరసనల హోరు
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డే రాజ్యసభలో నిరసనలను ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలన్న డిమాండ్లతో సమావేశాల తొలి రోజే సాయిరెడ్డి పోడియంను ముట్టడించారు. తన పార్టీకి చెందిన సభ్యులతో కలిసి నానా హంగామా చేశారు. అసలు తాము ఉన్నది పెద్దల సభలోనేనా అన్న విషయాన్ని కూడా మరిచి సాయిరెడ్డి వ్యవహరించారని చెప్పాలి. సాయిరెడ్డి నిరసనల తీరును అనుసరించిన ఇతర విపక్షాల సభ్యులు కూడా ఆయన బాటలోనే నడిచారు. మొత్తంగా పెద్దల సభలో రణరంగాన్నేసృష్టించారు. ఈ ఘటనలను తలచుకున్న వెంకయ్య.. సభాధ్యక్షుడి స్థానం ఉన్న పోడియం దేవాలయంలోని గర్భగుడి లాంటిది అని.. భక్తులు గర్భగుడి వద్దకు వెళ్లొచ్చు గానీ.. గర్భగుడిలోకి ప్రవేశించరాదన్న విషయాన్ని గుర్తించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన కంట కన్నీరు ఒలికింది.
Must Read ;- జగన్ మాదిరే సాయిరెడ్డికీ గండమే