ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్తం లెక్కా పత్రం లేకుండా ఖర్చులు చేయడమే కాకుండా.. లెక్కా పత్రం లేకుండానే అప్పులు కూడా చేస్తోందట.లెక్కా పత్రం లేని ఖర్చులను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెడితే.. లెక్కా పత్రం లేని అప్పులను స్వయంగా కేంద్రమే బయటపెట్టింది. ఇలా ఈ లెక్కా పత్రం లేని అప్పులను కేంద్రం చేత టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ బయటపెట్టించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కనకమేడల రవీంద్ర కుమార్ సంధించిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ సర్కారు లెక్కా పత్రం లేని అప్పులను బయటపెట్టింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వివిధ కార్పొరేషన్లు, కంపెనీలు పేర్లు చెప్పిన ఏపీ సర్కారు.. పలు బ్యాంకుల నుంచి ఏకంగా రూ.56,076 కోట్ల మేర అప్పులను తీసుకుందట. ఈ అప్పుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి పొందిన రుణమే రూ.15,00 కోట్లు ఉందట.
పయ్యావుల చెప్పిన లెక్క సగమే
ఇటీవలే రాష్ట్రం చేస్తున్న అప్పులు, చేస్తున్న ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పలు విరాలను కోరుతూ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం ఏడాదిగా జాప్యం చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలో కాగ్ అందించిన రిపోర్టులను పరిశీలించిన పయ్యావుల మరింత మేర సమాచారాన్ని ఏపీ ఆర్థిక శాఖ నుంచే సేకరించి.. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట జగన్ ప్రభుత్వం రూ.25 వేల కోట్లను అప్పుగా తీసుకుందని నిర్ధారించేశారు. అంతేకాకుండా రూ.41 వేల కోట్ల మేర ఖర్చులకు అసలు లెక్కా పత్రమే లేదని కూడా ఆయన నేరుగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కే ఫిర్యాదు చేశారు. మొత్తంగా అప్పులతో పాటు బడ్జెట్ పేర్కొనకుండా.. బడ్జెటేతర అప్పులుగా ఏపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందన్న విషయాన్ని పయ్యావుల తేల్చేశారు. ఈ క్రమంలోనే బడ్జెట్ పద్దుల్లో పేర్కొనకుండా జగన్ సర్కారు మరింత మేర అప్పులు చేసి ఉంటుందని టీడీపీ అనుమానించింది. ఇందులో భాగంగానే ఏపీ అప్పులపై సమగ్ర వివరాలను కోరుతూ కనకమేడల కేంద్రానికి ప్రశ్న సంధించారు.
కేంద్రం చెప్పిందేమిటంటే..?
కనకమేడల ప్రశ్నకు స్పందించిన కేంద్రం.. మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చింది. ఈ సమాధానం ప్రకారం బడ్జెటేతర అప్పుల కింద ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.56,076 కోట్ల మేర రుణాలను తీసుకుంది. ఈ అప్పులన్నీ కూడా 2019 ఏప్పిల్ 1 నుంచి ఇప్పటిదాకా తీసుకున్నవే. అంటే జగన్ జమానాలో తీసుకున్నవే. అప్పుల కోసమే వివిధ కార్పొరేషన్లు, కంపెనీలను ఏర్పాటు చేసిన జగన్ సర్కారు.. ఆ కార్పొరేషన్లు, కంపెనీల పేర్లు చెప్పి పలు బ్యాంకుల నుంచి ఈ అప్పులను తీసుకుంది. ఈ అప్పుల్లో ఎస్బీఐ వాటానే రూ.15 వేల కోట్ల మేర ఉందట. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.7 వేల కోట్లకు పైగా తీసుకున్న జగన్ సర్కారు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లు సహా మరిన్ని బ్యాంకుల నుంచి ఈ అప్పులు తీసుకుందట. మరి అప్పులను ఎలా చెల్లిస్తానని చెప్పిందో, ఏఏ ఆదాయాలను చూపిందోనన్న అంశంపై ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- దిగిపోతారా?.. చేతులెత్తేస్తారా?