కేరళ కుట్టి నయనతార పెళ్లి తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇంతకీ వీరి పెళ్లి ఎప్పుడో తెలియదుగానీ కలిసి తిరిగే ఫొటోలు మాత్రం వైరల్ అవుతుంటాయి. తమిళ యువదర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయన్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఓసారి ఇద్దరూ కలిసి కేరళలోని నయన్ ఇంటికి కూడా వెళ్లారు. దీని మీద క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి తన పెళ్లి విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని నయన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది.
దర్శకుడు విఘ్నేశ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందట. పెళ్లి కూడా అతి త్వరలో జరగబోతోందట. ఈ ఇంటర్వ్యూలో అధికారికంగానే ఆమె ఈ వివరాలు వెల్లడించింది. త్వరగా వివాహం చేసుకోవాలని నిశ్చయించుకోడానికి కారణం ఆమె తండ్రి కురియన్ కొడియట్టు అనారోగ్యం కూడా. కూతురి పెళ్లిని కళ్లారా చూడాలన్న కోరిక ఏ తండ్రికైనా ఉంటుంది. అందుకే సస్పెన్స్ కు తెరదించేస్తూ నయన్ ప్రకటన చేసేసింది. నయనతారలో తమిళంలో మంచి క్రేజ్ ఉంది. రజినీ కాంత్ అన్నాత్తేలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా కతువాకుల రెండు కాదల్, నెట్రిక్కన్ చిత్రాల్లోనూ నటిస్తోంది.
బాలీవుడ్ లో షారుఖ్ తో కలిసి నటించే అవకాశం కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి అట్లీ దర్శకత్వం వహించనున్నారు. నెట్రికన్ చిత్రాం డిస్నీప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానున్నట్టు సమాచారం. దీనికి మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. ఇందులో రోడ్డు ప్రమాదంలో కంటి చూపును కోల్పోయే పాత్రను నయన్ పోషించిందట. కొరియన్ సినిమా బ్లైండ్ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టు చెబుతున్నారు. నెట్రికన్ అంటే మూడో కన్ను అనే అర్థం ఉంది. ఇదో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పెళ్లి చేసుకుంటే నయన్ సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది తేలాలి. ఇప్పటికే ఈ అమ్మడి వయసు 37 సంవత్సరాలు. అమ్మ పాత్రలకు దగ్గరలోనే ఉంది. కాకపోతే యువ దర్శకుడితో ఆమె జీవితం సెటిల్ అయిపోతుంది.
Must Read ;- మరో సస్పెన్స్ థ్రిల్లర్ కోసం రంగంలోకి నయన్!