ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మామూలుగా లేదనే చెప్పాలి. తమను విమర్శించినా, గతంలో తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని భావించినా.. సదరు వ్యక్తులపై ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్న చందంగా కదులుతున్న వైసీపీ నేతలు.. ఎడాపెడా కేసులు పెట్టేస్తున్నారు. పోలీసులు కూడా వైసీపీ సర్కారు పెద్దల మాటకు తలొగ్గి వైసీపీ నేతలు ఇస్తున్న ఫిర్యాదులు మాత్రమే తీసుకుంటూ.. వైసీపీపై ఇతర పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను అస్సలు తీసుకోవడం లేదన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో వైసీపీ అధికారంలోకి రావడంతోనే నాటి ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై నిజంగానే కక్ష గట్టినట్టుగా వ్యవహరించింది. అయితే ఈ విషయంలో కాస్త నిదానంగానే వెళ్లిన ఏబీ.. ఇప్పుడు రివర్స్ అటాక్ ప్రారంభించారు. ఈ అటాక్ కు తాజాగా మరింతగా ఆయన పదును పెంచారు.
ఎన్నికల్లో రూ.50 కోట్లకు ఎస్కార్ట్..?
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఏబీ వ్యవహరించారని, టీడీపీ నేతలు చెప్పినట్టుగా ఎన్నికల ఖర్చుల కోసం ఆ పార్టీ రూ.50 కోట్ల తరలించేందుకు యత్నించగా.. అందుకు ఏబీనే స్వయంగా ఎస్కార్ట్ ఇచ్చినట్టు ఆయనపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. దానిపై జగన్ కుటుంబ ఆధ్వర్యంలోని సాక్షి టీవీ, సాక్షి పత్రిక ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. దీనిపై కాస్త ఆచితూచి అడుగు వేసిన ఏబీ.. తాజాగా ఆరోపణలు గుప్పించిన సాయిరెడ్గితో పాటుగా ఆ వార్తను ప్రచురించి, ప్రసారం చేసిన వ్యవహారంలో జగతి పబ్లికేషన్స్ ఎండీ హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి, టీవీ ఈడీ వినయ్ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్ మురళి, పత్రిక ప్రింటర్-పబ్లిషర్ రామచంద్రమూర్తిలకు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అసత్య ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.1 కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని ఏబీ సదరు నోటీసుల్లో హెచ్చరించారు.
కింకర్తవ్యేమిటో..?
ఇప్పటికే కోర్టు కేసులతో చీదరపట్టిపోయిన సాయిరెడ్డి, సజ్జలలు.. ఏబీ నోటీసులకు ఏ రీతిన స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉంటే.. తామేం చెప్పినా నడుస్తుందన్న భావనతో వైసీపీ పెద్దలు ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు గుప్పించడంతో పాటుగా కేసులు కూడా నమోదు చేయిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి క్రమంలో వైసీపీకి చెందిన కీలక నేతలైన సాయిరెడ్డి, సజ్జలపై ఏబీ ఏకంగా పరువు నష్టం దావా వేస్తానని పేర్కొంటూ నోటీసులు పంపిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తనపై కక్షసాధింపు ధోరణితోనే వైసీపీ ముందుకు సాగుతోందని బలంగా నమ్ముతున్న ఏబీ ఏ విషయాన్నైనా అంత ఈజీగా వదిలే రకం కాదు. ఇలాంటి నేపథ్యంలో ఏబీ నోటీసులతో సాయిరెడ్డి, సజ్జల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారోనన్న చర్చకు తెర లేసింది.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే











