సినిమా ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. శతదినోత్సవం అనే మాటే ఇప్పుడు వినపడటం లేదు. సినిమా రెండు వారాలు ఆడితే చాలు అది శతదినోత్సవ సినిమాగా లెక్కలు కట్టేస్తున్నారు.
‘నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లో’ అంటూ మైక్ లో సినిమా గురించి ఊదరగొట్టే రోజులు కావివి. సినిమానే కాదు మార్కెంటింగ్ లోనూ కొత్త విధానం వచ్చేసింది. సినిమాతో ఎంత తర్వగా వసూళ్లు సాధించి బయటపడాలా అని ఆలోచించే నిర్మాతలు కూడా ఎక్కువై పోయారు. అందుకే సినిమాల విడుదలకు ముందు ప్రచార సరళి కూడా మారిపోయింది. టీజర్, ట్రైలర్ లతోనే ప్రేక్షకుల దృష్టిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమా విడుదల లోపు ఆ సినిమాకి సంబంధించిన టేస్ట్ ను కొద్ది కొద్దిగా చూపిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు ఆడియో విడుదల కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపేవారు.
సినిమా విడుదల నెల, రెండు నెలల ముందు ఆడియో విడుదల చేసేవారు. ఈలోగా ఆ పాటలు జనంలోకి వెళ్లేవి. ఇప్పుడలా కాదు. ఒక్కో పాట లిరికల్ వీడియోలు మార్కెట్లోకి వదులుతున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. సినిమా రంగంలో డిజిటల్ స్పేస్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో టీజర్ లు, ట్రైలర్ లు వదిలి అవి జనంలోకి చొచ్చుకుపోవడానికి భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. వ్యూస్ రికార్డులు ఇప్పుడు రంగ ప్రవేశం చేశాయి. ఒకప్పుడు ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ లాంటివి జరిగేవి. అలాగే సినిమా విడుదలయ్యాక తప్పని సరిగా సక్సెస్ మీట్ లు కూడా ఏర్పాటవుతున్నాయి.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే..
1970 నుంచి 1990 వరకూ ఉన్న సినిమా ప్రమోషన్ ల విధానం వేరు. అప్పట్లో రేడియో, పత్రికల్లో వ్యాపార ప్రకటనల మీదే ఆధారపడి సినిమాల ప్రచారం ఉండేది. నటీనటుల ఇంటర్వ్యూలు, కొన్ని ఈవెంట్ లు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలంటేనే తడిసి మోపెడవుతోంది. సినిమాల ప్రమోషన్ కు అయ్యే ఖర్చు విషయంలో పెద్ద మార్పేమీ లేదు. కాకపోతే యూట్యూబ్ లాంటి ప్రచార సాధనాలు వచ్చాక ఫ్రీ పబ్లిసిటీకి ఎక్కువ అవకాశం దొరికింది. ప్రతి నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ప్రారంభించింది.
దీని కోసం ప్రత్యేకమైన టీమ్ లను ఏర్పాటుచేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. లాంటి ఫ్లాట్ ఫామ్స్ తో ముందుకు దూసుకెళుతున్నారు. ప్రతి నిర్మాణ సంస్థ పేరుతోనూ ఈ అకౌంట్లు ఏర్పాటవుతున్నాయి. దీని వల్ల ప్రెస్ మీట్ లు ఏర్పాటుచేయకుండానే తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పేస్తున్నారు. దినపత్రికల్లో సినిమా పేజీలు తప్ప సినిమా మ్యాగజైన్లకు కూడా కాలం చెల్లిపోయింది. ప్రజల్లో చదవడం కూడా బాగా తగ్గిపోయింది.
ఆధునిక పోకడలు
2005 నుంచి ప్రచార సరళిలో ఆధునిక పోకడలు వచ్చేశాయి. వెబ్ సైట్లకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పుడు వాటికి కూడా క్రమేపీ ప్రాధాన్యం తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా తారలు థియేటర్లను సందర్శించడం, మాల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం, టీవీ షోలు, రియాలిటీ షోలలో నటులు పాల్గొనడం లాంటివి సినిమాల మీద హైప్ పెంచడానికి తోడ్పడుతున్నాయి. సినిమాని ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. 2010 తర్వాత నుంచి టీవీల నుంచి డిజిటల్ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగింది. 15 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులంతా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారు.
అందుకే డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ బాగా విస్తరించింది. ఫస్ట్ లుక్, పోస్టర్ రిలీజ్, వీడియో జిఫ్, టీజర్, మినీ ట్రైలర్, మెయిన్ ట్రైలర్.. ఇలా రకరకాల పద్ధతులతో ముందుకు వెళుతున్నారు. ఇక రీల్స్ లేదా మీమ్స్ లాంటివి సరేసరి. భారీ సినిమాలు ట్రిపుల్ ఆర్, ఆచార్య, అఖండ, సర్కారువారి పాట.. లాంటి సినిమాల ప్రచార సరళి ఎలా ఉందో గమనించవచ్చు. తరచూ వార్తల్లో నిలవడమే వారికి కావలసింది. బాలీవుడ్ లో రేపు ‘షేర్షా’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రొమాంటిక్ రీల్స్ ను జనంలోకి వదిలారు. హీరోల ఫ్యాన్స్ పేజీలు కూడా ఇలాంటి ప్రచారానికి దోహదపడుతున్నాయి.
అందరి దృష్టినీ ఆకర్షించి మిలియన్ల కొద్దీ వ్యూస్ కొల్లగొడితే అంతే చాలు.. సినిమా జనంలోకి వెళ్లిపోతుంది. లేకుంటే ఆ సినిమా విడుదలైందో లేదో కూడా తెలియదు. తెలివిగా వ్యవహరిస్తే గతంతో పోలిస్తే ప్రచారానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. మంచి డిజిటల్ టీమ్ ఉంటే చాలు చాలా సులభంగా సినిమా జనంలోకి వెళ్లిపోతుంది. కావాలనే కొన్ని సినిమా లీకుల్ని కూడా వదులుతుంటారు. దీంతో పాటు వివాదాలను కూడా కావాలనే సృష్టిస్తుంటారు. ఏదైనా ఒక పాట మీద వివాదాన్ని సృష్టిస్తే చాలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తాయి. తద్వారా నిర్మాతలకు అదనపు రాబడి కూడా ఉంటోంది. ఈ ప్రచార సరళి ఇంకా ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి.
– హేమసుందర్
Must Read ;- సినిమా కోట్లు దాటుతున్నా నిర్మాత గడప దాటడే!