ప్రజాప్రతినిధులపై పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం… పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దిశానిర్దేశం చేసే హక్కు కోర్టులకు లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పార్లమెంటు, అసెంబ్లీ అధికారాల్లోకి చొరబడలేమని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధులపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది… ఆయా నేతలపై వేటు వేయాల్సింది… అంతిమంగా స్పీకరేనని, ఈ విషయంలో నిర్ణీత వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశాలు జారీ చేయలేమని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలా చేయడమంటే… పార్లమెంటు, అసెంబ్లీ అధికారాల్లోకి కోర్టులు చొరబడినట్టేనని కూడా కోర్టు అభిప్రాయపడింది.
నిర్ణీత కాల వ్యవధిని సూచించలేం
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ చట్టాన్ని ఉల్లంఘించే నేతలపై అనర్హత వేటు వేసే విషయంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని, దీంతో చట్టం ఉన్నా ఉపయోగపడిన దాఖలాలు కనిపించడం లేదని, దీనిపై నిర్ణీత సమయంలోగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రణజీత్ ముఖర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం నాడు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ బోపన్న, జస్టిస్ రిషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ వివాదంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. కోర్టుల పరిది ఎంత? చట్టసభల పరిధి ఏమిటి? అన్న విషయాలను నిర్వరిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టసభల అధికారాల్లోకి చొరబడలేం
పార్లమెంటు, అసెంబ్లీల అధికారాల్లోకి జొరబడటం కోర్టులకు సాధ్యపడదని ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవడానికి లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్, రాష్ట్రాల అసెంబ్లీల్లో స్పీకర్ లు ఉన్నారని, చర్యలు తీసుకోవడం వారి పరిధిలోనిదేనని కూడా ఆయన తెలిపారు. నిందితులపై ఎప్పటిలోగా చర్యలు తీసుకోవాలో స్పీకర్లకు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసే అధికారం కోర్టులకు లేదని, అలా చేస్తే… చట్టసభల అధికారాల్లోకి కోర్టులు చొరబడినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇటీవల కర్ణాటకలో రేకెత్తిన రాజకీయ సంక్షోభ సమయంలోనూ ఇదే తరహా సూచనలు చేసిన విషయాన్ని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చర్యలన్నీ స్పీకర్ల చేతిలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని ధర్మాసనం తెలిపింది.
Must Read ;- సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. నెలలో నాలుగు విలక్షణ తీర్పులు