జగన్ సర్కారుకు చుక్కలు చూపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు మరోమారు అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అందుకనుగుణంగానే సీఐడీ అధికారులు లాజికల్ గా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయినా రఘురామరాజుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ఆయనను మరోమారు సీఐడీ అధికారులు ఎలా అరెస్ట్ చేస్తారు? అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని లాజికల్ పాయింట్స్ ను ఆధారం చేసుకుని సీఐడీ అధికారులు రఘురామరాజును అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రఘురామరాజు పరంగా చూస్తే… ఈ తరహా యత్నాలు భారీ ట్విస్ట్ గానే కనిపిస్తున్నా… అసలు ఈ దిశగా ఏం జరుగుతోంది? అసలు సీఐడీకి అందివచ్చిన అవకాశాలు ఏమిటి? రఘురామరాజు చేసిన తప్పిదం ఏమిటన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
రిలీజ్ ఆర్డర్ పై సంతకం చేయలేదా?
రఘురామరాజుకు సుప్రీంకోర్టే బెయిల్ మంజూరు చేసినా… అది షరతులతో కూడినదేనని చెప్పక తప్పదు. లక్ష రూపాయల విలువ కలిగిన బాండ్ ను సమర్పించాలన్న నిబంధనతో బెయిల్ తెచ్చుకున్న రఘురామరాజు… సదరు బాండ్ ను సర్పించినా… రిలీజ్ ఆర్డర్ పై మాత్రం సంతకం చేయలేదట. బెయిల్ వచ్చే సమయానికి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న రఘురామరాజు… గుంటూరులోని సీఐడీ కోర్టుకు లక్ష రూపాయల ష్యూరిటీని పంపించి సికాంద్రాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. అంటే… రిలీజ్ ఆర్డర్ పత్రాలపై రఘురామరాజు సంతకం చేయలేదట. రఘురామరాజు సంతకం కోసం గుంటూరు జైలు అధికారులు సికింద్రాబాద్ వచ్చేసరికే రఘురామరాజు ఢిల్లీ ఫ్లైటెక్కేశారట. దీంతో చేసేది లేక జైలు అధికారులు సంతకం లేని రిలీజ్ ఆర్డర్ నే కోర్టుకు సమర్పించారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐడీ కోర్టు… నిందితుడి సంతకం లేకుండా ఆయనను ఎలా విడుదల చేశారంటూ నిలదీసిందట. అంతేకాకుండా నిందితుడి సంతకం లేకుండా ఆయన విడుదల కుదరదని కూడా స్పష్టం చేసిందట. అంతేకాకుండా రఘురామరాజు ఇంకా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నట్లుగా పరిగణిస్తున్నట్లుగా పేర్కొందట. అంతటితో ఆగని కోర్టు… రఘురామరాజు కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తున్నట్లుగా తాజాగా ఆదేశాలు జారీ చేసిందట.
ఎస్పీకి జైలు అధికారుల లేఖ
ఈ ఉత్తర్వులను ఆధారం చేసుకుని గుంటూరు జిల్లా జైలు అధికారుల ద్వారా సీఐడీ అధికారులు మరోమారు రఘురామరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. సీఐడీ అధికారుల ఆదేశాలతో ఇప్పటికే చర్యలను ప్రారంభించిన జైలు అధికారులు… రఘురామరాజును అదుపులోకి తీసుకుని జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీకి లేఖ కూడా రాశారట. ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దిశగా జిల్లా ఎస్పీ యోచిస్తున్నారట. ఇదిలా ఉంటే… తమ రఘురామరాజు విడుదల విషయంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదని, అంతా చట్టప్రకారమే నడుచుకున్నామని ఆయన తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. మొత్తంగా సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ తో విడుదలైన రఘురామరాజును మరోమారు అరెస్ట్ చేసే దిశగా ఏపీ పోలీసులు చర్యలు ప్రారంభించారన్న వార్తలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ దిశగా ముందుకు సాగేందుకు జగన్ సర్కారు గుడ్డిగా అనుమతిస్తుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Must Read ;- రాష్ట్రాల గవర్నర్లు,లెప్ట్‌నెంట్ గవర్నర్లకు రఘురామరాజు లేఖలు











