టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పట్నుంచీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. మొదటగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ముందుకువెళ్తేనే ..కాంగ్రెస్ బలపడుతుందని భావించారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు.
తప్పుడు ప్రచారం
కాంగ్రెస్ లో టీజేఎస్ ను విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పార్టీ అధ్యక్షుడు కోదండరాం క్లారిటీ ఇచ్చారు. గతంలో జేఏసీగా ఏర్పడి ప్రజా సమస్యలపై పోరాడుదామని, రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసింది మాత్రం నిజమేనని అన్నారు. కానీ టీజేఎస్ ను విలీనం చేసేదీలేదని.. అదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. విలీనానికి సంబంధించి రెండుపార్టీల మధ్య ఎటువంటి చర్యలు జరగలేదని తేల్చి చెప్పారు. త్వరలో హుజూరాబాద్ లో జరుగబోయే ఉప ఎన్నికలో బరిలో పోటీ చేయాలా? వద్దా? అనే విషయాల గురించి నిర్ణయం తీసుకుంటానని కోదండరాం వెల్లడించారు.
కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీజేఎస్ కీలక ప్రాత పోషించిందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాలు చేసిందని కోదండరాం అన్నారు. ప్రజా సమస్యలపై ఇతర పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం తప్ప.. తమ ఆస్థిత్వాన్ని కోల్పోయేది లేదని స్పష్టం చేశారు. త్వరలో ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, పలు సమస్యలపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఏడాదిపాటు పనిచేసిన నర్సులను తొలగించడం దారుణమని, న్యాయం కోసం ప్రగతి భవన్ కు వెళ్తే అరెస్టులు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని ప్రొ.కోదండరాం అన్నారు.
Must Read ;- రెండేళ్లలో కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యం: రేవంత్