నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనపై గవర్నర్‌కే ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులు దళిత యువతను ప్రోత్సహిస్తున్నారని, వీరిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.
రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినా..
ఉగ్రవాదుల చర్యను సమర్ధించిన వీరి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తన లేఖలో వర్ల రామయ్య వివరించారు. సివిల్ కాండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించి, ఉగ్రవాదులను సమర్థించే విధంగా వ్యవహరిస్తున్నఈ ఇద్దరు అధికారులపై రాజద్రోహం కేసులు పెట్టాలని కోరారు. వీరి ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య గవర్నర్‌కు రాసిన లేఖలో కోరారు. దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.
థర్ట్ డిగ్రీ ప్రయోగంపై..
ఇప్పటికే సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై నర్సాపురం ఎంపీ రఘురామరాజు తనపై థర్ట్ డిగ్రీ ప్రయోగించారని కేంద్రానికి, తన ఫోన్ తిరిగి ఇవ్వకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ రాజు ఫిర్యాదుతో ఆయన ఉద్యగానికే ముప్పు రావచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇవే కాకుండా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన సునీల్ కుమార్ క్రిస్టియన్ మతంలోకి మారారని, అందువలన ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. మతం మారితే రిజర్వేషన్‌తో పొందిన ఉద్యోగం కోల్పోతారంటూ ఇటీవల వచ్చిన మద్రాస్ హైకోర్టు తీర్పును కూడ ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. వీటన్నింటి నేపథ్యంలో సునీల్ కుమార్‌కు పదవి గండం ఖాయమన్న ఊహాగానాలు వస్తున్నాయి.
Must Read ;- సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ వీడియోలు మాయం..











