హిందూ దేవాలయాల సొమ్మును నవరత్నాలకు బదిలీ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హిందూ దేవాలయాల సొమ్మును బ్రాహ్మణ కార్పొరేషన్‌కు, అక్కడి నుంచి పీడీ అకౌంట్లకు బదిలీ చేసి ఏపీ ప్రభుత్వం నవరత్నాలకు వినియోగిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హిందూ దేవాలయాల సొమ్ము దేవాలయాల పునరుద్దరణకు, అర్చకుల సంక్షేమానికి వినియోగించాలని ఆనం నెల్లూరులో డిమాండ్ చేశారు. పలు హిందూ దేవాలయాలకు వచ్చిన ఆదాయాన్ని ముందుగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు మళ్లించి ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి ప్రభుత్వ పీడీ ఖాతాలకు బదిలీ చేశారని ఆనం సాక్ష్యాలతో బయట పెట్టారు. హిందూ దేవాలయాలకు చెందిన డబ్బు ఇతర మతస్తులకు ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ముస్లింలను వదల్లేదు
వక్ఫ్ బోర్డు నిధులను ప్రభుత్వం దారి మళ్లించి పీడీ ఖాతాల ద్వారా వైఎస్ఆర్ ఆసరా పథకానికి మళ్లించిందని, దాని కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు చదివి వినిపించారు. దేవాలయాలు, ముస్లిం మైనారిటీ బోర్డు నుంచి దారి మళ్లించిన నిధులను వెంటనే ఆయా ఖాతాల్లో జమ చేయాలని ఆనం డిమాండ్ చేశారు. దేవాలయాల సొమ్ము దారి మళ్లిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, వచ్చే కానుకలు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకుని వెంటనే నిధులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిలువు దోపిడీ…
భక్తులు దేవుళ్లకు నిలువు దోపిడీ ఇస్తే వచ్చిన డబ్బును నవరత్నాల పేరుతో ఆ నిధులను సీఎం జగన్మోహన్‌రెడ్డి నిలువు దోపిడీ చేస్తున్నారని ఆనం తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టి, దేవాలయాలకు వచ్చిన డబ్బును కూడా నిలువుదోపిడీ చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు. హిందూ దేవాలయాల డబ్బును నవరత్నాలకు వాడే హక్కు ఎవరిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
Must Read ;- ఆగని దాడులు : ఏపీలో దేవాలయాల ధ్వంస రచన!











