( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అధికారం … హోదా ఉంది కదా అని.. తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించగలరని ఆశించి ఉపాధ్యాయ సంఘాల నేతలు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తమ గోడు వినిపించారు. మరి ఆయన ఏం చేశారో తెలుసా? చాలా తెలివిగా… విద్యాశాఖ మంత్రికి ఓ సిఫార్సు లేఖ పంపారు. అందులో ఉపాధ్యాయులు వెల్లడించిన సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించేలా చూడాలని చెప్పాల్సింది పోయి… వారిచ్చిన వినతిని తెలుగు నుంచి ఇంగ్లీషులోకి ట్రాన్సలేషన్ చేసి తన పని అయిపోయింది అన్నట్టు కథను అంతటితో ముగించేశారు. ఇంతోటి ట్రాన్సలేషన్ తమకు చేతకాక… ఆయన వద్దకు వెళ్ళామా? అని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బదిలీల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందించి న్యాయం చేయాలని ఎంపీకీ లిఖిత పూర్వక వినతి పత్రాన్ని సమర్పించారు. అందులో పేర్కొన్న సమస్యలను… యధాతథంగా… టీచర్స్ యూనియన్ నాయకులు పేర్కొంటున్నట్టు చెబుతూ… ఇంగ్లీషులోకి ట్రాన్సలేషన్ చేసి విద్యాశాఖ మంత్రి సురేష్‌కు పంపారు. ఆ మాత్రం ఇంగ్లీషు రాకుండానే ఉపాధ్యాయులమయ్యామా? అని వారంతా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం మిగిలింది. విద్యాశాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చేలా లేకుండా.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సిఫార్సు లేఖ రాసినట్టు ఉండకుండా పంపిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రభుత్వం మొండిగా ముందుకు..
ఉపాధ్యాయ పోస్టుల బ్లాకింగ్, వెబ్ కౌన్సెలింగ్‌పై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీల డిమాండ్లు, ఆందోళనలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడంపై ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. ఖాళీ పోస్టులను బ్లాక్ చేయడం తొలిసారి కాదని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గిరిజన ప్రాంతాల పాఠశాలల్ని దృష్టిలో ఉంచుకుని బ్లాక్ చేసిన పోస్టులను బదిలీలుపూర్తయ్యాక మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తూ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
బదిలీలు ఎందుకు?
మూడేళ్ల తర్వాత జరుగుతున్న బదిలీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో కోరుకున్న ప్రదేశానికి వెళ్లవచ్చని ఉపాధ్యాయులు ఆశపడ్డారు. మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో పనిచేస్తూ ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏవో కుంటి సాకులు చెబుతూ వారిని ఎంతగానో నిరాశ పరిచింది. మాధ్యమం నమోదులో తేడా వల్ల పోస్టులు కోల్పోయిన పాఠశాలలకు తిరిగి వాటిని కేటాయించాలని, బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా కాకుండా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) డిమాండ్ చేస్తోంది. ఇందుకు గల కారణాలను సైతం విద్యామంత్రికి, ఉన్నతాధికారులకు నేతలు పలుమార్లు వివరించారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా ఉపాధ్యాయులను రోడ్లపైకి రప్పిస్తున్నారని, ఇది తగదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఫ్యాప్టో ఆధ్వర్యంలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ఉపాధ్యాయులు ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.