పరిపాలన రాజధానిగా విశాఖపట్నం…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అంతర్గత రాజకీయ సమీకరణాలనూ ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా పార్టీలో నంబర్ 2 అని భావిస్తున్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆధిపత్యానికి క్రమంగా చెక్ పెడుతోంది. విశాఖపట్నంలో ఆయన ప్రాభవాన్ని సీఎం జగన్ క్రమంగా తగ్గిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయసాయిరెడ్డి నాలుగేళ్లుగా పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు. విశాఖపట్నం అంటేనే విజయసాయి రెడ్డి అన్నట్టుగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ముద్ర పడిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలన్న నిర్ణయం ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టినట్టుగా చేసింది.
నేనే అక్కడికి వెళ్తుంటే… ఆయన ఎందుకు…
విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించాలని వైఎస్ జగన్ ఆతృతగా ఉన్నారు. తాను విశాఖలోనే ఉంటాను కాబట్టి ఇక అక్కడ విజయసాయిరెడ్డి ఎందుకని ఆయన యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాజధానిలోనే రెండో అధికార కేంద్రం ఉండటం పట్ల ఆయన కుటుంబ సభ్యులు విముఖంగా ఉన్నారు. దాంతో వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి ప్రభావాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు విశాఖపట్నం బయలుదేరేటప్పుడు తన వాహనం ఎక్కిన విజయసాయిరెడ్డిని జగన్ దించేయడం అప్పట్లోచర్చనీయాంశమైంది. ఆ తరువాత కూడా అటు పార్టీపరంగా ఇటు పరిపాలన పరంగా జగన్ తీసుకుంటున్న ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు అలాంటి వాదనకు బలం ఇస్తున్నాయి.
పార్టీ ప్రధాన కార్యాలయ బాధ్యతలు సజ్జలకు
జగన్ సీఎం కావడంతో పార్టీ వ్యవహారాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయ బాధ్యతలను మరొకరికి అప్పగించాలని భావించారు. పార్టీ రోజువారి వ్యవహారాలన్నీ చూసే ఈ నేతతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు టచ్‌లో ఉండాల్సి వస్తుంది. అంత కీలకమైన ఆ పోస్టు విజయసాయిరెడ్డికి ఇస్తారని ఆయన వర్గీయులు భావించారు. కానీ జగన్ మాత్రం పార్టీ ప్రధాన కార్యాలయ బాధ్యతలను సజ్జల రామకృష్ణా రెడ్డికి అప్పగించడం గమనార్హం. సజ్జలకు సహయకారిగా ఉండేందుకు ఆయన సన్నిహితుడు లేళ్ల అప్పిరెడ్డిని రాష్ట్ర పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అంటే విజయసాయిరెడ్డి పార్టీలో నంబర్ 2 కాదని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
భూదందా నేతపై సస్పెన్షన్ వేటు
విశాఖపట్నంలో భూదందాలకు పాల్పడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డిని ఇటీవల పార్టీ నుంచి బహిష్కరించారు. విజయసాయిరెడ్డి పేరు చెబుతూ ఆయన భూదందాలకు పాల్పడినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు సీఎంకు నివేదిక ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన పేరు దుర్వినియోగం చేస్తున్నారని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినపప్పటికీ ఆయన వాదనను ఎంత మంది నమ్మారో చెప్పలేని పరిస్థితి..
సాయిరెడ్డి సన్నిహిత అధికారుల బదిలీలు..
విజయసాయిరెడ్డి మనిషిగా గుర్తింపుపొందిన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆర్‌పీ మీనాను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. కేవలం ఏడాది మాత్రమే విశాఖపట్నం సీపీగా ఉన్న ఆయన్ని బదిలీ చేయడం గమనార్హం. ఆ స్థానంలో ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందిన మనీష్ కుమార్ సిన్హాను నియమించారు. ఆయన ఇటీవలి వరకు ఇంటలిజెన్స్ విభాగం ఐజీగా ఉంటూ సీఎం జగన్‌కు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన ఉన్నతాధికారి కావడం గమనార్హం.
విజయసాయిరెడ్డి ఏరికోరి తెచ్చుకున్న విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఏడాది మాత్రమే విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న ఆయన్ని బదిలీ చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయన స్థానంలో ముక్కుసూటిగా అధికారిగా పేరున్న శ్రీకాకుళం కలెక్టర్ నివాస్‌ను విశాఖ కలెక్టర్‌గా నియమిస్తారని సమాచారం.
విజయ సాయిరెడ్డి సిఫార్సులతో నియమితులైన ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. వారిద్దరికీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.
ఈ పరిణామాలను గమనిస్తోంటే.. విజయసాయిరెడ్డి ప్రాధాన్యానికి నెమ్మదిగా కోత పడుతోందనే భావన చూసేవారికి కలుగుతోంది.