సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రప్రభుత్వం శనివారం సాయంత్రం ప్రకటించింది. అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలుచేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. అన్ లాక్ 4.0 అమలు చేయడంలో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
కంటైన్‌మెంట్ జోన్లు మినహాయిస్తే స్థానికంగా ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మోడీ సర్కార్ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా స్థానికంగా ఎలాంటి కొత్త లాక్‌డౌన్లు విధించకూడదని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం యధాతధంగా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయి. రాష్ట్ర పరిధిలోగానీ, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గానీ ఎలాంటి ఆంక్షలూ ఉండకూడదని ప్రకటించింది. ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా వ్యక్తులు, సరకు రవాణాకు అనుమతించాలని నిర్దేశించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై మాత్రం నిషేధం ఇంకా కొనసాగుతుంది. హోంశాఖ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.
అన్‌లాక్ 4.0 నిబంధనలు ఇలా ఉన్నాయి.
- సెప్టెంబర్ 7వ తారీకు నుంచి మెట్రో రైలు సర్వీసులు దశలవారీగా ప్రారంభం అవుతాయి. ప్రామాణిక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మెట్రో రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలని మెట్రో రైలు ప్రయాణాల్లో ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలని త్వరలో విడుదల చేయనున్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ త్వరలో విడుదల చేస్తుంది.
- సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది. రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అనుమతి మేరకు 50 శాతం మందితో ఆన్లైన్ తరగతుల నిర్వహించుకోవచ్చు.
- ఉపాధ్యాయుల వద్ద సూచనలు/ మార్గదర్శకాలు పొందేందుకు 9 నుంచి 12వ తరగతి విద్యార్థుకు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతి.
- సెప్టెంబర్ 21 నుంచి సామాజిక, విద్యా సంబంధిత, క్రీడా, వినోద, మత, రాజకీయ పరమైన ఫంక్షన్లకు వందమంది పరిమితితో అనుమతిస్తారు.
- స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, సినిమా థియేటర్ల పై సెప్టెంబర్ 30 వరకు నిషేధం కొనసాగుతుంది.
- సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ లకు అనుమతి.
- ఫేస్ మాస్క్ లు, థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు పాటించాలి.











