నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలిచే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు. తన శిష్యుడైన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడి పదవి ఇప్పించింది టీటీపీ అధినేత చంద్రబాబే అని వాఖ్యానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కొనేసి తెలంగాణలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నారని అన్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసి ఆ పార్టీని చంద్రబాబు భ్రష్టుపట్టించాడని, ఇప్పుడు ఏకంగా పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని ఆయన అన్నారు.
కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి
ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం కట్టబెట్టడంపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి కాకుండా మూడేళ్ల క్రితం పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారంటూ మండి పడుతున్నారు. కేఎల్లార్ ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌కు పదవి దక్కకుండా చాలా మంది సీనియర్లు ప్రయత్నించినా ప్రజాదరణ ఉన్న ఆయనకే కాంగ్రెస్ అధిష్టానం పదవి కట్టబెట్టింది. ఇక పదవి చేపట్టిన వెంటనే రేవంత్ పార్టీలోని అసంతృప్తి నాయకులను కలుస్తూ తనతో కలిసి పనిచేసేలా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అగ్నికి ఆజ్యం పోసే యత్నం చేస్తున్నారు.
ఎంపీలను కూడ బీజేపీలోకి పంపారంటూ..
తమ రాజ్యసభ ఎంపీలను కూడ చంద్రబాబు బీజేపీలోకి పంపించాడని విజయసాయి ఆరోపించారు. కేసుల నుంచి రక్షణ పొందేందుకే నలుగురు ఎంపీలకు బీజేపీ తీర్థం ఇప్పించాడని ఆయన అన్నారు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేందుకు తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడని ఆయన అన్నారు. ఇలా దేశం, రాష్ట్రాల్లో రాజకీయంగా ఏమి జరిగినా విజయసాయి చంద్రబాబుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేకనే ఏదో రకంగా ఆయనపై బురద జల్లే ప్రయత్నిం చేస్తున్నాడని అంటున్నారు.
Must Read ;- రేవంత్ జెట్ స్పీడులో ఉన్నారే!
కేసుల నుంచి రక్షణ కోసం నలుగురు ఎంపీలకు బిజెపి తీర్థం ఇప్పించాడు. ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ కేసు ఎప్పటికీ తేలకుండా తెలంగాణా పార్టీ అధ్యక్షుడిని గులాబి పార్టీలోకి చొప్పించాడు. పచ్చ రక్తం నరనరాల్లో ప్రవహించే కరడు కట్టిన ముఖ్యులను ముందుగానే కాంగ్రెస్ లోకి తోలాడు. బాబా మజాకా!
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 28, 2021
పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 28, 2021











