అది కేవలం సినీ నటుల అసోసియేషన్.. ఎన్నికలు జరిగిది కూడా సెప్టెంబరు నెలలో. లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా మూడు నెలల ముందు ఎలాంటి రచ్చా జరగదు. నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు ముగిసిపోతాయి. కానీ ఏ టీవీ చూసినా, సోషల్ మీడియా చూసినా మా ఎన్నికల రచ్చే కనిపిస్తోంది. ఇప్పటిదాకా బరిలో నలుగు అభ్యర్థులు కనిపిస్తే ఐదో వ్యక్తి కూడా తెర మీదికి వచ్చారు. వీరు కాకుండా మరికొందరు కూడా తెర మీదకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
సీవీఎల్ నరసింహారావు అనే నటుడు తెలంగాణ వాదాన్ని తెర మీదికి తెచ్చారు. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్నారనగానే లోకల్, నాన్ లోకల్ అంశం తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత అధ్యక్ష పీఠంపై మహిళలను కూర్చోబెట్టలేదన్న వాదం వచ్చింది. ఇప్పుడు తెలంగాణా వాదం. రేపు టీవీ ఆర్టిస్టులు కూడా తమకు కూడా ఓసారి అవకాశం కల్పించాలంటే పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న సభ్యులు 900 మందిలో 200 మంది టీవీ కళాకారులు కూడా ఉన్నారు.
తెలంగాణ, ఏపీ విభాగాలు ఏర్పాటుచేయాలని సీవీఎల్ డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే సినీ పరిశ్రమ కూడా రెండుగా చీలిపోక తప్పదు. కళ అనేది భాషకు సంబంధించిన అంశం. తెలుగు వారందరికీ ఒకే చిత్ర పరిశ్రమ ఉండటం సబబు. సీవీఎల్ కోరినట్టు రెండు విభజన చేయడం మొదలుపెడితే అన్ని విభాగాలకూ అది వర్తిస్తుంది. రేపు డైరెక్టర్ల అసోసియేషన్ లో కూడా ఇలాంటి డిమాండే వస్తుంది. అలా అనుకుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు శంకర్ ఆ అసోయేషన్ లో కీలక పదవిలో ఉన్నారు.
చీలికలు తీసుకురావడం వల్ల అసోసియేషన్లు బలహీన పడతాయి. సీవీఎల్ నరసింహారావు ప్రతిపాదనకు నటి విజయశాంతి కూడా మద్దతు పలికారు. తాను మా సభ్యురాలు కాకపోయినా చిన్న కళాకారుల సంక్షేమం కోసం సీవీఎల్ అభిప్రాయాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని ఆమె అన్నారు. అయినా మా అధ్య క్ష పదవికి ప్రతి సారీ పెద్ద తలకాయలే పోటీ పడుతున్నాయి. చిన్నవారికి కూడా ఓసారి అవకాశం ఇవ్వడంలో తప్పేమీ లేదు.
ఏకాభిప్రాయం ఎందుకు రాదు?
అసలు మా అసోసియేషన్ కు ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించలేమా అన్నది మరో వాదన. ఇదే అంశం రెండు రోజుల క్రితం జరిగిన ప్రకాష్ రాజ్, నరేష్ ల ప్రెస్ మీట్లలోనూ ప్రస్తావనకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడమే సరైన నిర్ణయమని ప్రకాష్ రాజ్ అంటే, నరేష్ మాత్రం ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తామన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తోనే నరేష్ ఎన్నికయ్యారు.
మరి నరేష్ ఈసారి మెగాస్టార్ చిరంజీవి బలపర్చిన అభ్యర్థి వైపు ఎందుకు మొగ్గుచూపడంలేదో అర్థం కావడం లేదు. పైగా ఆయన సమీప బంధువు జయసుధ ప్రకాష్ రాజ్ ప్యానల్ వైపు ఉంటే నరేష్ మాత్రం మోహన్ బాబు ప్యానల్ వైపు ఉన్నారు. ఇంతటి గందరగోళ వాతావరణంలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇలాంటి రచ్చ ఎందుకని సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
-హేమసుందర్
Must Read ;- మా ఎన్నికల బరిలో హేమ రూటే సపరేటా?