తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీ కీలక నేత స్టార్ క్యాంపెయినర్ విజయ శాంతి ఆ పార్టీకి బైబై చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆమెతో సమావేశం అయినట్టు వార్తలు వస్తున్నాయి. చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విజయ శాంతి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న బిజీ షెడ్యూల్‌లోనూ విజయశాంతిని ఆమె ఇంట్లో కలిసి వచ్చారు కిషన్ రెడ్డి. దీంతో ఆమె పార్టీలోకి రావడం కన్ఫర్మ్ అయినట్టు చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. కనీసం ఆ పార్టీ సీనియర్ నేతలకు కూడా ఈ విషయం తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే ఆమె ఎప్పుడు పార్టీలో చేరుతారు.. ముహూర్తం ఎప్పుడు అన్నది తెలియడం లేదు.
సొంత గూటికి తిరిగి చేరుతారా..
గతంలో ఆలె నరేంద్ర శిష్యురాలిగా ఆమే 1998వ సంవత్సరంలో బీజేపీలో చేరారు. యేడాది గడవక ముందే ఆమె మహిళా విభాగానికి కార్యదర్శిగా నియమించారు. 1999లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసి దేశ వ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోయింది. సోనియా గాంధీ బరేలీ నుండి పోటీచేయాలని నిర్ణయించుకోవడంతో నామినేషన్ ఉపసంహరించుకుంది. ఇక ఆ తరువాత ఏఐఏడీఎంకే పార్టీకి స్టార్ క్యాంపేయినర్ గా ఆమెనియమితులయ్యారు.
తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఆమె బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేసారు. 2009లో తల్లితెలంగాణ పార్టీ స్థాపించారు విజయశాంతి. తెలంగాణ పోరులో తమవంతు పాత్ర పోషించిన విజయ శాంతి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉధ్యమంలో క్రియాశీలకంగా పనిచేసారు.
ఆ తరువాత కొన్నిరోజులకే ప్రజల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో తన పార్టీని టీఆర్ఎస్ పార్టీలో కలిపి వేసారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ తో కలిసి విస్తృతంగా పనిచేసారు. 2011లో కేసీఆర్ తో కలిసి ఎంపీ స్థానానికి రాజీనామా చేసినా ఆ తరువాత ఆ రాజీనామా లేక ను తిరస్కరించారు లోక్ సభ స్పీకర్.
ఇక 2014 ఎన్నికల నాటికి ఆమె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడితో విభేదాలు రావడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరింది విజయ శాంతి. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయ శాంతి ఓడిపోయారు. ఆ తరువాత పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇక 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా నియమించి ఎన్నికల ప్రచార కమిటీ కి అడ్వైజర్ గా పనిచేసారు. అయితే ఆ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆ పార్టీకి మరింత దూరం అయ్యింది. ఆ తరువాత పెద్దగా ఎవరితోనూ టచ్ లో లేకుండా పోయింది. కేంద్రంలో రాష్ట్రంలో పార్టీ మరింత ప్రజలకు దూరమవుతుందని భావించిన విజయ శాంతి తిరిగి సొతగూటికి చేరేందుకు రంగం సిద్దం చేసుకుంది.
ముహూర్తం కొసం వెయిటింగ్..
విజయ శాంతి గత కొంత కాలంగా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఈ విషయాలు ఎవరికీ తెలియకుండా భేటీ అయ్యారు. తాజాగా నిన్న మరోసారి స్వయంగా కిషన్ రెడ్డే విజయ శాంతి ఇంటికి వెళ్ళి సమావేశం అవ్వడం ఆ విషయం కాస్తా బయటకు పొక్కడంతో అసలు విషయం బయట పడింది. అయితే పార్టీలోకి ఎప్పుడు వచ్చినా ఆహ్వానించేందుకు సిద్దంగా ఉన్నామని కిషన్ రెడ్డి సూచించినట్టు సమాచారం.
అయితే తానే ఓ మంచి రోజు చూసుకుని పార్టీలో చేరుతానని చెప్పినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 10వ తేదీలోపే మూహూర్తం ఖారారు చేసుకుని చెబుతా అన్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలోనే పార్టీ కండువా కప్పేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి బీజేపీలోకి వలసలు ప్రారంభమైనట్టే అంటున్నాయి పార్టీ వర్గాలు.