వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లేఖల మీద లేఖలు రాస్తూనే ఉన్నారు. ఈ వ్యవహరంపై వైసీపీ సర్కారు సైలంట్ ఉంటున్నప్పటికీ.. సీఎం జగన్ రెడ్డి కి మాత్రం తలనొప్పిగా మారుతోందని పలువురు వైసీపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. వరుసగా లేఖల మీద రాస్తుండటంతో.. రఘరామరాజు వ్యూహం ఏమిటో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రధాన సమస్యలపై లేఖలు సంధించినా.. రఘురామరాజు తాజాగా మరో లేఖను వదిలారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయన రాసిన ఈ లేఖలో సర్పంచ్‌ల అధికారాల్లో కోత విధించడం ప్రజాస్వామ్యానికి చేటు అని ప్రస్తావించారు. సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై స్పష్టత లేదని, దీంతో బ్యాంకుల నుంచి నిధులు తీసుకోలేక నిస్సహాయంగా మారారని లేఖ తెలిపారు.
అభివృద్ధి నిలిచిపోయింది
సర్పంచుల అధికారులకు చెక్ పెట్టడం.. పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. జగన్ సర్కార్ పైసా కూడా మంజూరు చేయకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభ క్రియాశీలత్వం కోల్పోయి అలంకారప్రాయంగా మారిందన్నారు. పంచాయతీలను వైసీపీ సర్కారే బలహీన పరుస్తోందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. జగన్ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం పోతోందని, చివరకు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. పంచాయతీల గురించి ఆలోచించి.. వెంటనే సర్పంచ్‌లకు ఉండాల్సిన అన్ని అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకోవాలని రఘురామరాజు డిమాండ్ చేశారు.
పంచాయతీ రాజ్ అతిపురాతనమైంది
రఘురామరాజు కేవలం సర్పంచ్ అధికారాలు, అభివృద్ధిపనులపై మాత్రమే కాకుండా.. పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టుపుర్వోత్తరాల గురించి వివరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా శక్తివంతమైందని, పంచాయతీలు చెప్పే మాట దేవుడి ఆజ్ఞతో సమానమైనదని పేర్కొన్నారు. దేశంలో 2.5 లక్షల పంచాయత్‌లు ఏదో ఒక పేరుతో కొనసాగుతూ పురాతన ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కొనసాగింపుగా ఉన్నాయన్నారు. దేశాభివృద్ధిలో పంచాయతీలు కీలకం వ్యవహరించాయి కాబట్టే.. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం నినాదాన్ని తీసుకువచ్చారని రఘురామరాజు గుర్తు చేశారు. కనీసం బ్యాంకుల నుంచి అవసరమైన నిధులను తీసుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో సర్పంచ్‌లు నిస్సహాయంగా ఉండిపోతున్నారని రఘరామరాజు మండిపడ్డారు.











