అర్ధరాత్రి .. 11.30 గంటల సమయం.. ‘అమ్మా బాగా ఆకలి వేస్తుంది. పిల్లాపాపలతో 30మంది వరకు ఉన్నాం. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. అన్నం పెట్టించడమ్మా’ అంటూ ఒక మహిళా వలస కూలి ఆమెకు ఫోన్ చేసారు. ఆ ఫోన్ కాల్ ఆమెలోని మాతృమూర్తిని మేల్కొల్పింది. అర్ధరాత్రి వేళ ఆమె నడుం బిగించారు. చేతిలోకి గరిటి తీసుకున్నారు. పనివాళ్లను అప్రమత్తం చేశారు. 30మందికి సరిపడ్డా ఆహారపదార్థాలు చకచకా సిద్ధం చేశారు. తన డ్రైవర్ను కారు సిద్ధం చేయమన్నారు. ఆహార పదార్థాలను పట్టుకుని తానే నేరుగా బయలు దేరారు. విజయనగరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో విశాఖ – విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో మోదవలస వద్ద ఏర్పాటు చేసిన వలస కూలీల శిబిరానికి చేరుకున్నారు.
అప్పటికే ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను, కన్నీటి పర్యంతం మవుతున్న పిల్లాపాపలను చూసి చలించిపోయారు. ఆమె నేరుగా వారందరికీ ఆహారపదార్థాలను అందించారు. పిల్లలకు బిస్కెట్లు, వేడి పాలు అందచేశారు. వారి కళ్లలో ఆనందం చూసి స్ఫూర్తి పొందారు. రాష్ట్రంలో కరోనా ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో ఈ కార్యక్రమం నిర్వహించి జిల్లా పోలీసు యంత్రాంగానికి, జిల్లా ఉన్నతాధికారులకు, ఇతరులకు స్ఫూర్తి నింపారు. అప్పటి నుండి ఇప్పటివరకూ అటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తునే ఉన్నారు. ఆమె ఇంకెవరో కాదు .. ఖాకీలో కారుణ్యాన్ని చూపిన ఆమె విజయనగరం జిల్లా ఎస్ పి .. బి. రాజకుమారి, ఐపిఎస్.
సాధారణ స్థాయి నుండి..
విజయనగరం ఎస్పీగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకుమారి ఓ సాధారణ విద్యార్థి. ప్రతీరోజు ఆర్టీసి బస్సులో కాలేజీకి వెళ్లి వచ్చేది. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించింది. క్రమశిక్షణ, పట్టుదలతో 2006లో ఐపిఎస్ సాధించారు. నల్గొండలో ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ గాను, నూజివీడు ఎఎస్పి గాను, నిజామాబాద్ అదనపు ఎస్పీగా , మంగళగిరిలోని ఎ.పి.ఎస్.పి 6వ బెటాలియన్ కమాండెంట్ గా భాద్యతలు నిర్వహించారు. రాజమండ్రి అర్బన్ పోలీస్ శాఖకు మొదటి మహిళా ఎస్.పి.గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం విజయనగరం ఎస్పీగా చక్కని పరిపాలనా దక్షత చూపుతూ, ఖాకీ దుస్తుల వెనుకనున్న మమతానురాగాలను పంచుతూ, ఖాకీలు అంటే ఖర్కసులు కాదు సాటి మానవులేనని, వారిలోనూ మానవత్వం ఉందని నిరూపిస్తూ తన సిబ్బందితో సాక్షాత్కరింప చేస్తున్నారు.
ఆమె స్ఫూర్తితోనే ..
విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి నింపిన స్ఫూర్తితో .. గజపతినగరం సిఐ బి. రమేష్ ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మెంటాడ గ్రామాన్ని అక్టోబరు 16న సందర్శించారు. ఆ గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కేరంగి పైడయ్య, అంకాలమ్మ అను ఇద్దరు అన్న, చెల్లెలను కలుసుకొని వారి ఆరోగ్యం గురించి ఆరా తీసిన అనంతరం వారికి రూ. 10 వేలు ఆర్థిక సహాయం, ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించి, పేద కుటుంబానికి అండగా నిలిచారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి బ్రిడ్జి పై గోతులు ఏర్పడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తుండటంతో అక్టోబరు 16న కొత్తవలస కానిస్టేబుల్ వై.సురేష్ కుమార్ తన సొంత ఖర్చులతో తానే స్వయంగా గుంతలను పూడ్చే పని చేపట్టారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గోళ్ళలపాలెంలో వర్షాలకు పాడైన కాలువను, రహదారిని అక్టోబరు 15న కొత్తవలస పోలీసులు మరమత్తులు చేసి, ప్రజల రాక, పోకలకు ఇబ్బందులు లేకుండా చేశారు.
ఎస్పీ రాజకుమారి స్ఫూర్తితో విజయనగరం జిల్లా నలుమూలల పోలీసు అధికారుల నుండి దిగువ స్థాయి సిబ్బంది వరకూ ప్రతీరోజు ఏదో ఒక చోట మానవతా విలువలు ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహిస్తూ ‘శభాష్ పోలీసు’ అనిపించుకుంటున్నారు.











