మానవత్వం మంటకలుస్తోంది. సాటి మహిళలను గౌరవించాలనే ధోరణీ అస్సలు ఉండటంలేదు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళలకు మాత్రం మానవ మృగాల నుంచి రక్షణ దొరకడంలేదు. ఎక్కడోచోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతునే ఉన్నాయి… పెరుగుతునే ఉన్నాయి. హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఇలాంటి హత్యాచార ఘటనలు జరగడం కలకలం రేపుతోంది.
అత్యాచార ఘటనలు జరగకుండా న్యాయవ్యవస్థ, పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికినీ అయిన వారి నుంచే మహిళకు లైంగిక దాడులు తప్పడంలేదు. తాజాగా పాతబస్తీలో జరిగిన ఓ ఘటన మరింత ఆందోళన కల్గిస్తోంది. తన సోదరుడి ప్రేమను ఇష్టపడని అన్నే.. ఆ సోదరుడి ప్రియురాలిపై హత్యాచార దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్ బజార్‌లో ఓ యువతిపై అత్యాచారం చేసి ఆపై ఆ యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. దీనికి మతాంతర ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.
నగరానికి చెందిన ఓ యువకుడు, నారాయణఖేడ్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇష్టపడని ఆ యువకుడి అన్న ఓ పథకం పన్నాడు. సోదరుడు ప్రేమించిన ప్రియురాలిపై దారుణానికి ఓడిగట్టాడు. ఆ యువతిపై అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్యచేసినట్లు తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఓల్డ్‌సిటీలో కలకలం రేపింది. నిందితున్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ యువతి మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి ఆమె బంధువులకు అప్పగించారు.