వి.ఎన్. ఆదిత్య పేరు వినగానే దర్శకుడిగా ఆయన రూపొందించిన తొలిసినిమా ‘మనసంతా నువ్వే’ గుర్తొస్తుంది. యువతలో అది ఓ ఫీల్ గుడ్ మూవీగా ముద్రపడిపోయింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా ‘నేనున్నాను’ రూపొందించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. వి.ఎన్. ఆదిత్య సినిమా అంటే మ్యూజికల్ డ్రామాగానూ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. పాటల పరంగా తన సినిమాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారాయన. దర్శక లెజెండ్ సింగీతం శ్రీనివాసరావు శిష్యుడిగా సినీ రంగ ప్రవేశం చేసి దర్శకత్వ రంగంలో తనదైన శైలితో ముందుకు వెళుతున్నారాయన. త్వరలోనే ‘వాళ్లిద్దరి మధ్య’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడిగా దాదాపు 13 సినిమాల ప్రయాణాన్ని కొనసాగించిన ఆయన ‘లియోన్యూస్’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
* హీరో బాలకృష్ణ నటించిన ‘భైరవ దీపం’ సినిమాకి నేను స్క్రిప్ట్ అసిస్టెంట్ గా చేశాను. నా పనితనం చూసి ‘నువ్వు చాలా తొందరగా డైరెక్టర్ అవుతావు’ అని బాలయ్యబాబు అన్నారు. ఆ తరువాత తమిళంలో హీరో కమల్ హాసన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదని వెంటనే తమిళం రాయడం, చదవడం నేర్చేసుకున్నా.
* కమల్ హాసన్ తో సినిమా చేయడంతో నాకూ, కమల్ కీ మంచి స్నేహం ఏర్పడింది. మా స్నేహాన్ని చుసిన డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు’ సినిమాకి వర్క్ చేయమన్నారు. ఆ సమయంలో మా బ్రదర్ పెళ్లి ఉండడంతో హైదరాబాద్ వచ్చేశాను. హైదరాబాద్ వచ్చిన వెంటనే సురేష్ ప్రొడక్షన్ లో వెంకటేష్ హీరోగా ‘ప్రేమించుకుందాం రా’కు వర్క్ చేశాను.
* వెంకటేష్ సినిమా తరువాత చిరంజీవి హీరోగా నటించిన ‘బావగారు బాగున్నారా’కు పని చేశా. అప్పుడు చిరంజీవిగారు ప్రెస్ మీట్ లో నాగురించి చెప్పారు. తొందర్లోనే ఈ అబ్బాయి మంచి డైరెక్టర్ అవుతాడన్నారు. మెగాస్టార్ ఆలా చెప్పేసరికి ఎంతో ఆనందపడ్డాను. అక్కడ నుండి నాకు విపరీతమైన ఆఫర్స్ వచ్చాయి. మేము డబ్బులు పెడుతున్నాం.. మా మాటే వినాలి అన్న ప్రతి ప్రొడ్యూసర్ ని రిజక్ట్ చేశాను. పెద్ద పెద్ద హీరోలు తనకు చెత్త కథలు చెప్తే మొహం మీదే బాలేదు అని చెప్పి వచ్చేసేవాడిని.
* నాగార్జున నటించిన ‘బాస్’ సినిమా సెకండ్ హాఫ్ స్టోరీ బాలేదు మార్చాలని నిర్మాతలతో చెప్పాను. కాని వాళ్ళు మాకు ఇలాగే కావాలి అనడిగారు. ఓకే అని చెప్పి సినిమాని డైరెక్ట్ చేసి ఇచ్చేశాను.
* నా మొదటి సినిమా హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం నన్ను చాలా బాధించింది. ఒక విధంగా ఉదయ్ కిరణ్ తనతో తను ఫైట్ చేసుకున్నాడు. అయినా ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు.
* నేను మెగాస్టార్ తో చేయాల్సిన సినిమా మూడు సార్లు మిస్సయ్యింది. ఈసారి ఎలాగైనా ఆయనతో సినిమా చేసి తీరుతాను. నేను కథ విషయంలో చాల కర్కశంగా ఉంటాను. నేను చిరంజీవిగారితో చేయవల్సిన సినిమా స్టోరీ నచ్చలేదని ప్రొడ్యూసర్స్ కి చెప్పాను. వెంటనే ప్రొడ్యూసర్స్ ఆ కథను పక్కన పెట్టేశారు. అలా నాకు చిరంజీవితో సినిమా చేసే అవకాశం పోయింది.
* నాకు నా గురువు సింగీతం శ్రీనివాసరావు గారంటే వల్లమాలిన అభిమానం. ఆయన కూడా నన్ను ఒక కొడుకులాగా చూసుకుంటారు. హైదరాబాద్ వస్తే నన్ను కలవకుండా ఉండరు. ఆయన వచ్చారని తెలిస్తే నేనే వెళతా. కానీ ఆయన నాకు అప్పుడప్పుడూ సర్ ప్రైజ్ లు ఇస్తుంటారు.
* నెపోటిజమ్ ఒక్క సినిమా పరిశ్రమలోనే కాదు ప్రతి పరిశ్రమలో ఉంటుంది. కాకపోతే సినీ పరిశ్రమని అందరూ బూతద్దంలో చూస్తారు కనుక ఇక్కడ ఎక్కవ నెపోటిజమ్ ఉంటుందని బయట వాళ్ళు అంటారు అంటే. నిజంగా నెపోటిజమ్ ఉంటే అల్లు అర్జున్ విజయవంతం అయ్యాడు మరి అల్లు శిరీష్ పరిస్థితి ఏంటి. ప్రజలకు సినిమా నచ్చితే చూస్తారు.. లేకపోతే లేదు. నెపోటిజమ్ అనేది సినిమా పరిశ్రమలోనే తక్కువ.
* ఈ మధ్య ఏ డైరెక్టర్ సినిమా తీసినా వేరే వ్యక్తి వచ్చి ఇది నా కథ అని అనడం అలవాటుగా మారిపోయింది, అది తప్పు. అయినా సినిమా విడుదల కాకుండా తొందరపడకూడదు. ముందే ఆరోపణలు చేయడం వల్ల వాళ్లు కథను మార్చి తీయవచ్చు కదా.
* డ్రగ్స్ ఎక్కువ సినిమావాళ్ళే తీసుకుంటారు అనడం తప్పు. ప్రతీ చోటా ఈ డ్రగ్స్ కల్చర్ ఎక్కువైంది. హీరోలు, హీరోయిన్లు గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ తీసుకుంటారనడంలో నిజం లేదు.
వి.ఎన్. ఆదిత్య ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలనుకుంటే ఈ కింద వీడియో క్లిక్ చేయండి.