ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలనను గాడిలో పెట్టడానికి తీవ్రంగా శ్రమ పడాల్సి వస్తోంది. జగన్ పాలనలో అక్రమాలు జరిగిన తీరును చంద్రబాబు అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తుండగా.. ప్రతి శాఖలోనూ మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన దృష్టికి వస్తున్నాయి. వాటిలో వాలంటీర్ల సమస్య కూడా ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా గ్రామ, వార్డు వాలంటీర్లు పనిచేస్తున్న తీరు అలాంటి సమస్యల్లో ఒకటిగా ఉంది.ఈ వాలంటీర్లు గత ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ప్రయోజనాలను పొందుతూ వారి సంబంధిత పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను నడిపేవారు.
నిజానికి ఈ వాలంటీర్లను పెట్టిన ఉద్దేశ్యం ప్రజలకు సంక్షేమ పథకాల పంపిణీని సరళం చేయడం, ఇంకా వాటి పురోగతిని పర్యవేక్షించడం. అయితే టీడీపీ వ్యతిరేక ప్రచారం కోసం వాలంటీర్లు ఈ వాట్సప్ గ్రూపులను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో సోమవారం సాయంత్రంలోగా ఈ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులన్నింటినీ తొలగించాలని చంద్రబాబు ప్రభుత్వం వాలంటీర్లందరికీ కఠినమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సోషల్ మీడియా గ్రూపుల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని ప్రజలను కోరుతూ ప్రభుత్వం పబ్లిక్ నోటీసు కూడా జారీ చేసింది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలు ఆ గ్రూపుల నుంచి బయటకు వచ్చేలా చూడాలని ప్రభుత్వం కోరింది.
డిలీట్ చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల వివరాలను సాయంత్రంలోగా పంపాలని మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధికారులను చంద్రబాబు కోరారు. అయితే, వాలంటీర్లను అలాగే వదిలేయకుండా ఆ వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వాలంటీర్ల విద్వార్హతలు.. వయస్సుల వారీ వివరాలను సేకరిస్తోంది. వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం ఉండగా.. డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.. డిప్లొమా చేసిన వాళ్లు 2 శాతం.. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు 48 శాతం 10వ తరగతి చదివిన వారు 13 శాతంగా ఉన్నట్టు గుర్తించారు. వయస్సుల వారీగా 20 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వారు 25 శాతం, 26 – 30 వయస్సు ఉన్నవారు 34 శాతం, 31 – 35 ఏళ్ల మధ్యవారు 28 శాతం మంది వాలంటీర్లు ఉన్నట్లు గుర్తించారు.
అయితే, వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారి సామర్థ్యాలను పెంచాలని ప్రణాళికలు వేస్తున్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చి – మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు వైసీపీ వల్ల బలవంతపు రాజీనామా చేయడమూ లేదా వైసీపీ నేతల చేత తొలగించడమో జరిగిన సంగతి తెలిసిందే.