మెగాస్టార్ చిరంజీవి దూకుడు పెంచారు. ఇటీవలే గాడ్ ఫాదర్ వచ్చి హిట్ కొట్టిన ఆయన ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మరి వాల్తేరు వీరయ్య ఏం చేశాడు? అన్నది చూద్దాం.
కథలోకి వెళితే..
ఇది అన్నదమ్ముల సెంటి మెంట్ కథ. ఓ ఫ్లైట్ క్రాష్ కావడంతో కథ మొదలవుతుంది. సాల్మన్ సీజర్ (బాబి సింహా) అనే స్మగ్లర్ ను బంధించి ఆ ఫ్లైట్ లో తీసుకొస్తుంటే అది మారేడుమిల్లి అడవుల్లో కూలిపోతుంది. దాంతో అతన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉంచాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారి ఆదేశిస్తారు. అలా కటకటాల్లో ఉన్న అతడిని అతడి అనుచరులు విడిపించుకు తీసుకువెళతారు. కానీ సాల్మన్ వెళుతూ ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేసేవారిని పొట్టనపెట్టుకుంటాడు. ఆ స్టేషన్ ఇన్ ఛార్జి సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) ఎలాగైనా సాల్మన్ ను బంధించి తీసుకురావాలనుకుని అతన్ని పట్టుకునే పనిని వాల్తేరు వీరయ్య(చిరంజీవి)కు అప్పగిస్తాడు. అలా ఈ బృందం మలేషియా చేరుతుంది. సాల్మన్ ను పట్టుకోడానికి మలేషియాకు రా బృందం కూడా అక్కడే ఉంటుంది. అక్కడే రాలో పనిచేసే శ్రుతితో వీరయ్య ప్రేమలో పడతాడు. అసలు వీరయ్య స్కెచ్ ఏమిటి? ఈ కాంట్రాక్టుకు ఎందుకు ఒప్పుకున్నాడు? ఏసీపీ విక్రమ్ తో అతనికి ఉన్న అనుబంధం ఏమిటి? ఈ కథలో అసలు విలన్ మైఖేల్ (ప్రకాష్ రాజ్)ను వీరయ్య ఎలా మట్టుబెట్టాడు? అన్న ప్రధాన అంశాలతో ఈ కథ ముగుస్తుంది.
మో
ఎలా తీశారు? ఎలా చేశారు?
డ్రగ్ రాకెట్ కథలు ఇప్పటికే చాలా చూశాం. వాల్తేరులో జాలర్ల పేటలో ఉండే వీరయ్యను చాలా ఫవర్ ఫుల్ వ్యక్తిగా చూపించి అతనితో కామెడీ చేయించడం ఓ మైనస్ అని చెప్పాలి. ఎంటర్ టైన్ మెంట్ పంథాలో ఈ కథను చెప్పాలనుకోవడం బాబి చేసిన తప్పులా అనిపిస్తుంది. మలేషియాలో చిరంజీవి, అతని బృందం చేసే విన్యాసాలు ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. తన బాడీ లాంగ్వేజ్ తో వీరయ్య పాత్రలో చిరంజీవి మెప్పిస్తారు. కానీ సినిమాలో ఫీల్ తీసుకు రావడంలో దర్శకుడు ఫెయిలయ్యాడని అనిపిస్తుంది. కథ అలా సాగిపోతుంది కానీ ఎక్కడా మనం ఇన్వాల్వ్ కాలేం. పాత్రలు కలగా పులగంలా ఉన్నాయి. ప్రధానంగా ప్రథమార్థం అంతా వీరయ్య మీదే కథ సాగుతుంది.
ద్వితీయార్థంలో విక్రమ్ పాత్రలో రవితేజ ఎంటర్ అయినా అక్కడ కూడా ఎమోషన్స్ పండలేదు. ఏదో మిస్సవుతున్న భావనే ప్రేక్షకులకు కలుగుతుంది. సంభాషణల పరంగానూ చిత్రం వీక్ గా ఉంది. కేవలం మెగాస్టార్ వన్ మ్యాన్ షోగా సినిమా నడిచింది. ఆయనే సినిమాని తన భుజాస్కంధాలపై మోశారని చెప్పవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ అని చెప్పవచ్చు. పాటల పరంగా చూస్తే డ్యాన్స్ మూవ్ మెంట్ పరంగా చిరంజీవి మార్కు గ్రేస్ ఎక్కడా కనిపించలేదు. పాత సినిమాల్లో స్టెప్స్ చూసిన భావనే కలుగుతుంది. సత్యరాజ్ పాత్రకు కూడా న్యాయం చేయలేదు. అలా అనుకుంటే సినిమాలో ఏ పాత్రనూ సరిగా ఉపయోగించుకున్నట్టు లేదు. బాబి సింహా, ప్రకాష్ రాజ్ ల నటనలోనూ చెప్పుకోతగ్గ ప్రత్యేకత లేదు.
కొన్ని డైలాగుల మెరుపులు, చిరు మార్కు డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఉంటే బాగుండేది. ముఖ్యంగా డ్రగ్స్ చుట్టూనే కథను నడపడం కూడా మైనస్ గా చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని సన్నివేశాలు రాసినట్టుంది తప్ప కథను పట్టించుకున్నట్టు లేదు. కేథరిన్ పాత్ర విషయంలోనూ అంతే. ప్రీరిలీజ్ వేడుకలో ఆమె పాత్ర గురించి చెప్పినంత గొప్పగా ఏమీ లేదు. శ్రుతి హాసన్ ను కేవలం పాటల కోసమే పెట్టుకున్నట్టు ఉంది. నిర్మాణ పరంగా ఖర్చుకు వెనకాడలేదు. క్లైమాక్స్ సన్నివేశం కూడా పేలవంగా ముగిసింది. మలేషియాలో విలన్ ను తప్పించుకుని చిరంజీవి బయటపడ్డట్టుగా చూపించారు. అతడ్ని మట్టుబెట్టి ఉంటే హీరోయిజం ఎలివేట్ అయ్యేది. ఇలాంటి లొసుగులు సినిమాలో చాలా ఉన్నాయి.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతి హాసన్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, కేథరిన్ , రాజేంద్ర ప్రసాద్, నాజర్, సత్యరాజ్ , వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
కెమెరా: ఆర్థర్. కె. విల్సన్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని – రవిశంకర్
నిర్మాణం: మైత్రీ మూవీస్
కథ-మాటలు-దర్శకత్వం: బాబి
ఒక్క మాటలో: వన్ మ్యాన్ షో
రేటింగ్: 3/5