( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
పరిపాలన రాజధాని విశాఖలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో మిగిలింది ఆ ముగ్గురే. ఒక ఎమ్మెల్యే వైఎసార్సీపీ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొంటుండగా… మరో ఎమ్మెల్యే దాదాపుగా వైసీపీకి చెరువులోనే ఉన్నారు. ఇక మిగిలింది ఇద్దరు… విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. వీరిని కూడా కాస్త భయపెట్టి తమ పార్టీ వైపునకు లాక్కుంటే విశాఖలో లైన్ క్లియర్ అయినట్టే. అధికార పార్టీ ప్రస్తుత వ్యూహం ఇదే. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని ఉత్తరాంధ్ర వాసులు కోరనప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. మూడు రాజధానుల అంశానికి కోర్టు ఒక అడ్డంకిగా మారగా… మరో అడ్డంకి టీడీపీ నేతలు. విశాఖలో వారి ప్రభావం లేకుండా చేస్తే… కోర్టు క్లియరెన్స్ రాగానే పరిపాలనా రాజధాని కార్యకలాపాలు ప్రారంభించాలని అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి … ఇటు వైఎసార్సీపీ మంత్రులు తహతహలాడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా చేయని కుటిల రాజకీయం అంటూ లేదు. కక్ష సాధింపునకు పరాకాష్టగా విశాఖలో ప్రతిపక్ష నేతల ఆస్తుల స్వాధీన ప్రక్రియ కొనసాగుతోంది.
టీడీపీ నేతలే లక్ష్యంగా..
కొద్ది వారాల క్రితం క్రితం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి.. ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కొన్ని తొలగింపులు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇంటి ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నం చేశారు. పాతికేళ్ళ క్రితం ఆయన ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపించారు.అదే విధంగా వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గంలోని ఫుట్‌పాత్ ఆక్రమణల పేరిట టీడీపీ అనుకూల వర్గానికి చెందిన దుకాణాలను అడ్డగోలుగా తొలగించారు. ఆ తరువాత గీతం విశ్వవిద్యాలయం ఆస్తులపై అర్ధరాత్రి విరుచుకుపడ్డారు. భీమిలి నియోజకవర్గం మంగమారి పేట వద్ద ఉన్న గో కార్టింగ్ గేమింగ్ జోన్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అది టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడుగా ఉన్న కాశీ విశ్వనాధ్‌కి చెందినది. ఆయన వైజాగ్ ప్రొఫైల్స్ నుండి ఇక్కడి స్థలాన్ని పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే అధికారులు కాశీ విశ్వనాథ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించేశారు.

గంటా ఆస్తులపై..
విశాఖ సమీపంలోని సింహాచలం వద్ద 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది. మిగిలిన 64 ఎకరాలను దీపావళి పండుగ రోజున ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో గంటా శ్రీనివాసరావుకు చెందిన 4.84 ఎకరాల భూమి సర్వే నంబర్ 13లో ఉంది. ఈ భూమిని ఇండియన్ బ్యాంక్ వేలం వేస్తున్నట్లు ప్రకటించింది.. 13 స్థిరాస్తులు తనఖా పెట్టి రూ.248 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో ఈ భూమిని వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది. గంటా శ్రీనివాసరావుకు చెందిన వ్యాపార సంస్థ ప్రత్యూష రిసోర్స్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో 1997లో ఆ భూమి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించారని రెవెన్యూ అధికారులు గంటాకు చెందిన స్థలంలో ప్రహరీని తొలగించారు. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు నుంచి స్టే రావడంతో తదుపరి చర్యలను నిలిపివేశారు.
తాజాగా ఆదివారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆక్రమించారంటూ రుషికొండ సమీపంలోని గెడ్డ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పీలా గోవింద్ ఆధీనంలో ఉన్న ఆనందపురం మండలంలో దాదాపు 360 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
లొంగే వరకు కొనసాగుతాయట..
టీడీపీ నేతలు అధికార పార్టీకి సరెండర్ అయ్యే వరకు ఈ దాడులు కొనసాగుతాయని స్వయంగా అధికార పార్టీ నేతలే చెబుతుండడం విశేషం. ఎంత భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, పార్టీ మారేందుకు అంగీకరించని నేతల ఆస్తులను టార్గెట్ చేసుకున్నట్టు అధికార పార్టీ వ్యవహార శైలిని బట్టి అర్థమవుతోంది. ఆయా భూములు క్రమబద్ధీకరించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ.. కోర్టులను ఆశ్రయించి ఉపశమనం పొందే అవకాశం లేకుండా ప్రణాళికలు రచించుకుని.. శని.. ఆదివారాలు.. కోర్టు సెలవుల సమయం చూసి తొలగింపులు, స్వాధీనానికి పూనుకోవడం కక్షసాధింపు చర్యలే అన్న విమర్శలు వస్తున్నాయి.
కోర్టులు ఆదేశాలు ఇస్తున్నా..
విశాఖలో టీడీపీ నేతల ఆస్తులపై కొనసాగుతున్న దాడులపై కోర్టుల ద్వారా ఉపశమనం పొందాల్సి వస్తోంది. అత్యవసర పిటిషన్ల ద్వారా ఆస్తులను కాపాడుకోవాల్సి వస్తోంది. ప్రతి వ్యవహారంలోనూ స్టే వస్తున్నప్పటికీ, అధికార పార్టీ తన దూకుడును తగ్గించడం లేదు. టీడీపీ నేతలు, వారి ఆస్తులను విడిచి పెట్టడం లేదు. ఈ పరిణామాలు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నా… వెనక్కు తగ్గడం లేదు. స్థానిక ఎన్నికల్లో దీని పర్యవసానాలు చూడాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితులు విశాఖలో ఉన్నాయి.










