రజనీ పనై పోయింది.. వరుస ఫ్లాప్స్.. ఇక దుకాణం సర్దేయవచ్చు.. లాంటి మాటలకు చెక్ పడినట్టే. ఎందుకంటే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ రేపు విడుదలవుతోంది.
అంచనాలు లేవనుకున్న సినిమా కాస్తా అంచనాల సినిమా కేటగిరీలోకి వెళ్లిపోయింది. విడుదలకు ముందే సంచలనాలను నమోదు చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగానే ఒక్క రోజులోనే రూ.20.68 కోట్ల విలువైన టిక్కెట్స్ తెగాయి. సోమవారం సాయంత్రానికే ఆరు లక్షలకుపైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంటే దాదాపు రూ.20.68 కోట్లన్నమాట. అంతేకాదు తమిళనాడు వ్యాప్తంగా ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు. అలాగే బెంగళూరులోనూ కొన్ని సంస్థలు రేపు సెలవు ప్రకటించాయి.‘యునో ఆక్వా కేర్’ అనే సంస్థ ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తమ ఉద్యోగుల నుంచి లీవ్ రిక్వెస్టులు వెల్లువెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
అంతేకాదు తమ ఉద్యోగులందరికీ ఫ్రీగా జైలర్ టిక్కెట్లు ఇస్తుందట. ఈ సంస్థకు చెందిన వివిధ బ్రాంచ్‌లకు కూడా ఈ సెలవు ప్రకటించారు. ఈ కంపెనీ సెలవు అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో కూడా జైలర్ కొత్త రికార్డు సృష్టించింది. ఆన్‌లైన్ బుకింగ్స్ ద్వారానే మొత్తం 155 మార్నింగ్ షోలు ఫుల్ అయ్యాయి. దీంతో కేజీఎఫ్2 రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. అమెరికా, కెనడా, యూకే, మలేషియాలలో కూడా పెద్ద ఎత్తున ప్రీ బుకింగ్స్ జరిగాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేయవచ్చన్నది సినీ వర్గాల అంచనా.
భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్
రజినీకాంత్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 2.0 అవుతుంది. ఆ సినిమా దాదాపు 800 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే 13 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం టార్గెట్ తక్కువేననాలి. పాజిటివ్ బజ్ వస్తే ఈ వసూళ్లు పెద్ద కష్టమేమీ కాదు. ఇక కర్ణాటకలో రూ.10 కోట్లు, కేరళలో రూ.5.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ బిజినెస్ రూ.32 కోట్లుగా చెబుతున్నారు. ఆ లెక్కన ఇండియాలో రూ.91 కోట్లు, విదేశాల్లో రూ.32 కలుపుకుంటే రూ.123 కోట్ల బిజినెస్ జరిగినట్టే. అంటే దాదాపు రూ.250 కోట్లకుపైనే వసూలు చేస్తే తప్ప గిట్టుబాటు కాదు.
ఈ సినిమాలో నటించినందుకు రజినీ రూ.110 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఇందులో అతిథి పాత్ర పోషించిన మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రూ.8 కోట్లు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ రూ.4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. విలన్ గా నటించిన జాకీ ష్రాఫ్ రూ.4 కోట్లు, తమన్నా రూ.3కోట్లు, యోగిబాబు రూ.కోటి, రమ్యకృష్ణ రూ.80 లక్షలు, వసంత్ రవి రూ.30 లక్షలు తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి తోడు నిర్మాణ వ్యయం. ఆ లెక్కన చూస్తే దాదాపు 300 కోట్ల వరకూ వసూళ్లు సాధించాల్సిందే. అది కూడా షేర్ రూపంలోనే.
హిట్లకు దూరమైన రజినీ
నిజం మాట్లాడాలంటే రజినీ హిట్లకు దూరమయ్యారనే చెప్పాలి. ఆయన అభిమానులు కూడా నిరుత్సాహంలో ఉన్నారు. శంకర్ దర్శకత్వంలోని రోబో మాత్రమే అసలైన హిట్. ఆ తర్వాత ఆ స్థాయి సినిమా రానేలేదు. 2.0, కాలా, కబాలి, పేట, దర్బార్, అన్నాత్తే లాంటి సినిమాలు వచ్చినా బాక్సాఫీసు వద్ద తుస్సుమన్నాయి. రజినీ క్రేజ్ మీద ఇవి చాలా ప్రభావం చూపాలి. కానీ ఆ వాతావరణం కనిపించడం లేదు. జైలర్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.123 కోట్లు పలికాయి. అందులో రూ.60 కోట్లు తమిళనాడువే.
తెలుగులో మాత్రం రజినీ మార్కెట్ తగ్గిందనే చెప్పాలి. గతంలో కబాలి చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 కోట్లకు అమ్మారు. ‘కాలా’కు రూ. 33 కోట్ల బిజినెస్ జరిగింది. ‘2.0’ సినిమాకు తెలుగులో 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. కానీ ఆ తర్వాత రజినీ మార్కెట్ ఇక్కడ పడిపోయింది. ‘పేట’ రూ. 13 కోట్లు, ‘దర్బార్’ రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. ఇప్పుడు ఆ స్థాయిలో కూడా బిజినెస్ జరగలేదంటే అర్థం చేసుకోవచ్చు. రజినీ జాతకం రేపు తేలిపోతుంది. సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా దూసుకుపోతుంది. లేకుండా రాబోయే సినిమాల మీద జైలర్ ప్రభావం కచ్చితంగా ఉండి తీరుతుంది.