సూపర్ స్టార్, మెగాస్టార్.. ఇద్దరూ కూడబలుక్కుని అలా మాట్లాడారా? కాకతాళీయంగా మాట్లాడారా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. ఒకరు వ్యంగ్యాస్త్రంతో, ఇంకొకరు మెగాఅస్త్రంతోనే ప్రత్యర్థులపై దాడి చేశారు. ఆ ప్రత్యర్థులు ఎవరో కాదు వైసీపీ నేతలే.
‘మొరగని కుక్కలేదు… విమర్శించని నోరు లేదు… ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా’ ఈ మాటలు రజినీ ఎవర్ని ఉద్ధేశించి అన్నట్టు. సాధారణంగా సినిమా వాళ్లు ఎవరి మీద ప్రేమ ఉన్నా ద్వేషం ఉన్నా సమయం దొరికినప్పుడే స్పందిస్తారు. రజనీకి ఆ సమయం వచ్చింది. జైలర్ ఆడియో వేడుక చెన్నైలో జరినప్పుడు ఆయన ఈ మాటలు అన్నారు. అవి వైసీపీ నేతల్ని ఉద్ధేశించే అన్నారనే ప్రచారం జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు.
మహానటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ సభకు ప్రత్యేక అతిథిగా హాజరైన రజినీకాంత్ తెలుగుదేశం అధినేత చంద్రబాబును పొగిడారు. దాంతో వైసీపీలో అంబటి రాంబాబు లాంటి నేతలు కొందరు రజినీపై బురద జల్లే ప్రయత్నం చేశారు. దాంతో తమిళనాడులోని రజినీ అభిమానాలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతల్ని టార్గెట్ చేశారు. రజనీ మాత్రం మళ్లీ నోరు మెదపలేదు. తాజాగా జైలర్ విడుదల సందర్భంగా ఏర్పాటైన వేదికపై స్పందించి ఈ రకమైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతో ఎవరికి వారే భుజాలు తడుముకోవాల్సి వస్తోంది.
మెగాస్టార్ లో దూకుడు ఎందుకు?
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. నిజానికి ఇది సినిమా వేడుక.. రాజకీయ వేదిక కాదు అయినా చిరంజీవి ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం, రోడ్ల నిర్మాణం కోసం, పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం పనిచేయాలిగానీ సినిమాల మీద పడతారేంటి అని చిరంజీవి ప్రశ్నించారు.
బ్రో సినిమా విషయంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకు సమాధానంగా ఆయన స్పందించినట్టు ఉన్నా పరోక్షంగా ప్రభుత్వం మీద ఎదురుదాడిగానే ఇది కనిపించింది. 2021లో సినిమా టిక్కెట్ల ధరల పెంపు కోసం పోరాడిన బృందానికి చిరు నాయకత్వం వహించారు. సీఎం ను కలిసి ప్రాధేయపడ్డారు. ఒక మెగా స్టార్ అలా ప్రాధేయపడటం ఆయన అభిమానులకు ఇబ్బంది కలిగించింది. బహుశా అది ఒక పరాభవంలా భావించి చిరు ఈరోజు అగ్రెసివ్ గా స్పందించారా అన్న అనుమానం కలుగుతోంది.
గత కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2008లో ఆగస్టులో పార్టీ పెట్టినప్పుడు ఆయన రాజకీయ విమర్శలు అనేకం చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగెస్ లో విలీనం చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత రాజకీయాలకు దూరమై సినిమాలు చేసుకుంటున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఎన్నికల ప్రచారంలో ఉన్నా ఆయనకు మద్దతు వెళ్లలేదు. కానీ ఈసారి మాత్రం తన తమ్ముడి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి చిరు మళ్లీ వెళ్ల వచ్చన్న సంకేతాలు వస్తున్నాయి.
తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లినా చిరు ఈ కూటమికి మద్దతు పలికి వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకుంటారన్న ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ విమర్శల వల్ల దరేపు విడుదల కాబోయే భోళా శంకర్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న భయం పంపిణీదారుల్లో ఉంది. మొత్తానికి ఓ పక్క రజినీకాంత్, ఇంకో పక్క చిరంజీవి తమ చిత్రాలతో పోటీ పడుతూనే ప్రత్యర్థులపై దూకుడు పెంచారు. చిరంజీవి ఇలాంటి విమర్శలు చేయడం వెనుక పొలిటికల్ అజెండా ఏమన్నా ఉందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఏంజరుగుతుందో కాలమే నిర్ణయించాలి.