తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. కొన్నాళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తూ నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇక్కడ గెలిస్తే తెలంగాణలోని కాంగ్రెస్ కేడర్‌లో జోష్ వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీలో జోష్ తెచ్చింది. అందుకే త్వరలో కేసీఆర్ బహిరంగ సభనూ నిర్వహించనున్నారు. ఈ పరిస్థితులను గమనించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు జానారెడ్డి అప్రమత్తమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొత్తలో తానే ప్రచారం చేసుకుంటానని, వేరే వాళ్లు జోక్యం చేసుకోవద్దని, అంతగా ఆసక్తి ఉంటే..తనతో సంబంధం లేకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. అయితే అభ్యర్థిత్వాలపై క్లారిటీ వచ్చాక జానారెడ్డి తన పంథా మార్చుకున్నారు. ఇతర నేతలను ఆహ్వానించడంతో పార్టీలోని కీలక నేతలు ప్రచారం మొదలు పెట్టారు. ఇదంతా పైకి కనిపిస్తున్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం ఓ అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికల్లో రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ కనిపించకపోవడమే ఆ చర్చకు కారణం.

దుబ్బాక తరువాత..
దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో మాణికం ఠాగూర్ తెలంగాణ పీసీసీ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చారు. ప్రచారం కూడా చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీకి విజయం దక్కలేదు.తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలూ నిరాశనే మిగిల్చాయి. అప్పటి నుంచి మాణికం ఠాగూర్ పెద్దగా కనిపించడం లేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతర్గతంగా ఆన్‌లైన్ మీటింగ్ లకే పరిమితమయ్యారు. ప్రచారం కూడా చేయలేదు. మొత్తం మీద మూడు నెలలుగా మాణికం ఠాగూర్ సైలెంట్ గా ఉండడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా.. తెలంగాణ పార్టీ లీడర్ల వరకే బాధ్యతలు పరిమితం చేసినట్టు తెలుస్తోంది.
మాణికం ఠాగూర్ సీరియస్ అయ్యారా..
కాగా తెలంగాణ పీసీసీకి కొత్త సారథి నియామకం విషయంలో పార్టీలోనే బేధాభిప్రాయాలు తలెత్తాయి. దాదాపు 150 మంది నుంచి అభిప్రాయాలను సేకరించిన మాణికం ఠాగూర్ ఆ మేరకు నివేదికను అధిష్టానానికి పంపారు. టీపీసీసీ సారథిగా నియామకం కానున్నారని రెండు మూడు పేర్లు బయటకు వచ్చాయి. అందులో జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. దీంతో కొంతమంది నాయకులు మాణికం ఠాగూర్‌పైన విమర్శలు చేయడంతో పాటు ప్యాకేజీల కోణంలో ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన అధిష్టానానికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవచ్చు కాని.. ఇలాంటి విషయాల్లోనూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఏంటనే కోణంలో ఈ లేఖ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలతో అసహనానికి గురైన మాణికం ఠాగూర్ కొన్ని నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడు ఎన్నికల్లో బిజీనా..
ఓవైపు కొవిడ్ కారణంగా రాకపోకలు తగ్గాయని నాయకులు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడి విధురనగర్ ఎంపీగా ఉన్న మాణికం ఠాగూర్ కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చిందని నాయకులు చెబుతున్నారు. మాణికం ఠాగూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న విధురనగర్ జిల్లాలో కాంగ్రెస్, డీఎంకే, ఎండీఎంకేతో పాటు వామపక్షాలు, వీసీకే పార్టీల కూటమి అభ్యర్థుల ఎంపిక జఠిలంగా మారిన నేపథ్యంలో అక్కడే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు అయిన మాణికం ఠాగూర్ దాదాపు మార్చి మొదటి వారం నుంచి తమిళనాడు ఎన్నికల్లోనే నిమగ్నమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా తెలంగాణ ఎంపీలతో ఆయన మాట్లాడుతున్నారని, ఆన్ లైన్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రానికి వస్తారని, మాణికం ఠాగూర్ పై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారని కొందరు నాయకులు చెబుతున్నారు.











