తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ కూడా ఇక్కడ తాము కీలకమని చెబుతోంది. ఎటొచ్చీ కాంగ్రెస్ పార్టీకే ఈ ఉప ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారిందని చెప్పాలి. 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలుపు మినహా ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవలేదు. హుజూర్నగర్, దుబ్బాక ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఓడింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌కు గెలుపు ప్రాణప్రదమని చెప్పాలి. అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ గెలుపు రాష్ట్రంలోని పలువురు నాయకుల భవిష్యత్‌ను కూడా నిర్దేశించనుంది. అందులో ప్రధానమై నాయకుల విషయానికి వస్తే..రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల అంశాలను ప్రస్తావించవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే..
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే..అది పరాభవంగానే భావించాల్సి ఉంటుంది. సీనియర్ నాయకుడైన జానారెడ్డి వరుసగా రెండోసారి ఓడిపోవడం అంటే..పార్టీ కేడర్ కూడా డీలా పడుతుంది. అదే సమయంలో తాము ఓడినా..కాంగ్రెస్ కూడా ఓడిందని బీజేపీ చెప్పే అవకాశం ఉంది. తామే ప్రత్యామ్నాయమని బీజేపీ ఇప్పటికే చెబుతుండడం కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో పార్టీకి, నాయకులకు గెలుపు చాలా అవసరమని చెప్పాలి. ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్‌కు పునరుజ్జీవనంగా భావించవచ్చు.
ఇక నాయకుల విషయానికి వస్తే..
ఇక్కడ జానారెడ్డి గెలిస్తే..రేవంత్ స్పీడ్‌కి కొంత బ్రేకులు పడతాయని కొందరు నాయకులు చెబుతుండగా గతంలో రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండగా జానారెడ్డి సీఎల్పీగా చేశారని, పరస్పర వ్యవహారశైలి అర్థం అయ్యే ఉంటుందని మరి కొందరు నాయకులు చెబుతున్నారు. జానారెడ్డి గెలిస్తే రేవంత్‌తో పాటే పార్టీలోని మిగతా సీనియర్లకు చెక్ పడుతుందన్న అంచనాలున్నాయి. అయితే జానారెడ్డి చెక్ పెట్టే సీనియర్లలో చాలామంది రేవంత్ వ్యతిరేక వర్గంగానే పేరుంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి గెలిస్తే రేవంత్‌కి ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి టీపీసీసీ సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు జానారెడ్డి సానుకూలంగా స్పందిస్తే..రేవంత్ రెడ్డికి బలం పెరుగుతుంది.
కాని..జానారెడ్డి ఓడిపోతే..పార్టీలో విభేదాలు తారస్థాయికి వెళ్లడం ఖాయం. పీసీసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఇవి మరింత పెరుగుతాయి. ఎలాగూ పార్టీ ఓడింది కాబట్టి అధిష్టానం మాటను కూడా కొందరు నాయకులు ధిక్కరించే పరిస్థితి వస్తుంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసే ఆస్కారం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తామనే ప్రతిపాదన వస్తే..పలువురు నాయకులు బహిరంగంగానే వ్యతిరేకించే అవకాశాలూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తారా అనే అంశంపై సందేహాలూ వస్తున్నాయి.
వేచి చూస్తున్న రేవంత్..
టీటీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డి టీపీసీసీ ఇస్తామన్న అధిష్టానం హామీతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన తరువాత చానాళ్లకు వర్కింగ్ ప్రసిడెంట్ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ ఓడిపోవడంతో కొంత వెనక్కి తగ్గారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి గెలవడంతో స్పీడు పెంచారు. అప్పటి నుంచీ పీసీసీ పదవి ఊరిస్తూ వస్తోంది. ఇటీవల పీసీసీ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని భావించినా.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వరకు పీసీసీ ప్రకటన వద్దని జానారెడ్డితో పాటు పలువురు నాయకులు విన్నవించడంతో పార్టీ పీసీసీ నియామకాన్ని వాయిదా వేసింది. సాగర్ ఫలితాల తరువాత ఆ నిర్ణయం ఎలాగూ ప్రకటిస్తారు కాని సాగర్‌లో గెలిస్తే ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు. ఒకవేళ విభేదాలు తలెత్తినా సర్దుబాట్లకు అవకాశం ఉంటుంది. ఓడితేనే పార్టీలో ముసలం పుడుతుంది. అదే సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయాలపై అసహనంతో ఉన్నరేవంత్ వర్గం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
కొత్తపార్టీకి..స్కోప్ ఉందా..
కాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్నతో పాటు టీఆర్ఎస్లో కీలకంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కొత్త పార్టీ అవసరం ఉందని కొందరు నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల ఓవైపు పార్టీ ఏర్పాటు కార్యక్రమాలను ముమ్మరం చేసి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆ పార్టీ తెలంగాణేతర పార్టీ అని, ఒక వర్గానికి చెందిన ఓట్లను టార్గెట్‌గా ఏర్పాటు చేసిన పార్టీ అని ముద్రవేసే వారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పార్టీ కాకుండా మరో పార్టీ మనుగడ సాధ్యమా అనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే కొన్నాళ్లపాటు వేచి చూసే ధోరణిలో కొందరు నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మూడు నెలల తరువాత కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడం కూడా ఈ కోణంలో తీసుకున్న నిర్ణయంగానే భావిస్తున్నారు.
Also Read:ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు చెమటలు.. సాగర్ బరిలోనూ తీన్మార్ మల్లన్న?