కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచం ఎలా విలవిల్లాడిపోయిందో ప్రత్యక్షంగా చూశాం. ఇలాంటి ఉపద్రవం ఎందుకు ఉత్పన్నమైంది? దీని మీద జ్యోతిషశాస్ర్తం ఏమంటోంది? లాంటి అంశాలను చర్చించే ప్రయత్నమిది. ప్రతి వందేళ్లకూ ఇలాంటి ఉత్పాతాలు ఎదురవుతాయంటోంది జ్యోతిష శాస్ర్తం. 1918-19లో వచ్చిన స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా ఇలాంటి గ్రహస్థితులే ఉన్నాయని జ్యోతిష పండితులు అంటున్నారు. ప్రతి వందేళ్లకూ ఇలాంటి వైరస్ లు వచ్చిన చరిత్ర ఉందని కూడా మన శాస్ర్తవేత్తలు అంటున్నారు.
సెప్టెంబరు 25వ తేదీ రాహు, కేతువులు రాశులు మారితే కరోనా తగ్గుముఖం పడుతుందని అంటున్నారు జ్యోతిష పండితులు. గత ఏడాది డిసెంబరులో ఉన్న ఆరు గ్రహాల కూటమి, కాలసర్పదోషం ఈ వైరస్ విజృంభణకు కారణమని జ్యోతిషులు అంటున్నారు. ఈ కాల సర్పదోషం జులై 16తోనే ముగిసిపోయిందట. కాలసర్పదోషం అంటే ఏడు గ్రహాలు రాహు, కేతువుల మధ్య చిక్కుకుని ఉండటమట. మన గ్రహగతులకు కరోనా పుట్టుకకు జ్యోతిష్కులు చెప్పే విశ్లేషణ చూద్దాం. 2019 డిసెంబరు 26న మకర లగ్నంలో అమావాస్య రోజున కరోనా వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఆ సమయంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురువు, శని గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉన్నాయి. ఆరు లేదా ఎనిమిది గ్రహాలు ఒకే రాశిలో ఉండటం ప్రమాదకరమని మన పూర్వికులు అంటూ ఉంటారు. ప్రతి వందేళ్లకూ ఇలాంటి గ్రహకూటములు ఉంటుంటాయి. ఇంకొంతమంది జ్యోతిష్కులు అయితే వచ్చే సెప్టెంబరు 15వ తేదీతోనే కరోనా కాలం ముగిసిపోతుందని అంటున్నారు. ఆరోజు మేష లగ్నం, త్రయోదశి రోజున ఏడు గ్రహాలు మంచి స్థితిలో ఉంటాయని పేర్కొంటున్నారు. మన శాస్ర్తవేత్తలు వాక్సిన్ తీసుకురావడంలో విజయవంతమవుతారని అంటున్నారు.
జ్యోతిష శాస్ర్తంలో ఈ ప్రస్తావన ఉందా?
జ్యోతిష శాస్ర్తం సంహిత భాగంలో ఉన్న శ్లోకం ప్రకారం గురువు శనితో కలిసి ఉన్నా, శని నుంచి ఏడో స్థానంలో ఉన్నా ప్రజా నాశనం ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరులోనే గురు, శని, కేతువు ధనుస్సు రాశిలో కలిశారు. శని, గురువు, కేతువు… ఈ మూడు గ్రహాలు ఒకే రాశిలో ఎప్పుడు ఉన్నా యుద్ధ వాతావరణం ఉంటుందట. అంతేకాదండోయ్ రవి, చంద్ర, కుజ, రాహు, శుక్ర, శనులు ఒకే రాశిలో ఉంటే ఈ భూమ్మీద వినాశం జరుగుతుందట. కాకపోతే గత ఏడాది డిసెంబరులో కుజ, శుక్రులు ధనుస్సు లో లేరు.
మకర సంక్రాంతి తర్వాత కరోనా తీవ్రరూపం దాల్చింది. కుజుడు కూడా మకరంలోని శని, గురులతో మార్చి నెలలో కలిసిన తర్వాత మనదేశంలో కరోనా అలజడి ప్రారంభమైంది. వచ్చే నెల 14 నుంచి గురువు వక్రత పోతుంది. కరోనా వాక్సిన్ అప్పుడే వస్తుందట. వచ్చేనెల 29 వాక్సిన్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందట. సెప్టెంబరు 25న జరిగే రాహుకేతువుల రాశి మార్పుతో కరోనా పూర్తిగా అంతమవుతుందని జ్యోతిష పండితులు అంటున్నారు. వాక్సిన్ లతో నిమిత్తం లేకుండా కరోనా పోతే అంతకంటే కావలసిందేమీ ఉండదు. మరో పక్క మన శాస్ర్తవేత్తలేమో రెండేళ్లలో కరోనా కనుమరుగవుతుందని అంటున్నారు. మన వేద విజ్ఞానాన్ని మనం గౌరవిస్తం కాబట్టి త్వరలోనే మనకు మంచి రోజులు రావాలని ఆశిద్దాం.











