‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మధ్యనే విడుదలైన.. ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన సినిమా ‘ట్రాన్స్’. మనిషిలోని నమ్మకానికి మతం అనే మత్తిచ్చి.. వారి బలహీనతలతో వ్యాపారం చేసే కొందరు కార్పోరేట్ క్రిమినల్స్ అసలు గుట్టును రట్టు చేయడమే ఈ సినిమా కథాంశం. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ ను చాలా ధైర్యంగా , నిజాయితీగా తెరకెక్కించాడు దర్శకుడు అన్వర్ రషీద్. విమర్శకుల ప్రశంసల్ని సైతం అందుకొని.. మలయాళంలో మంచి సక్సెస్ ను నమోదు చేసుకున్న ‘ట్రాన్స్’ సినిమాని అదే పేరుతో తెలుగులోకి అనువదించారు.
కథేంటి? : చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి. మతి స్థిమితంలేని తమ్ముడితో కన్యాకుమారిలో జీవిస్తుంటాడు విజు ప్రసాద్. చిన్న చిన్న మోటివేషనల్ స్పీచులిస్తూ.. దాన్నే జీవనాధారంగా చేసుకున్న అతడిని… తమ్ముడి ఆత్మహత్య డిప్రెషన్ లోకి నెట్టేస్తుంది. అక్కడి నుంచి ముంబై నుంచి షిఫ్ట్ అయిన అతడికి .. అనుకోని వరంలా ఓ పెద్ద కాంటాక్ట్ దక్కుతుంది. పాస్టర్ గా మోటివేషనల్ ఉపన్యాసాలిచ్చి .. రెలిజియస్ మిరాకిల్స్ చేస్తూ.. జనాన్ని క్రైస్తవం పట్ల ఆకర్షితుల్ని చేసే అతి పెద్ద డీల్ అది. దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న విజు ప్రసాద్ .. అందులో ఎంతో సక్సెస్ సాధించి.. తనకి కాంటాక్ట్ ఇచ్చిన వారినే శాసించే పొజిజీషన్ కు చేరతాడు. చివరికి విజు ప్రసాద్ దాని వల్ల ఏం సాధించాడు? ఏం కోల్పోయాడు? అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? : జనానికి దేవుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని… తమకు అనుగుణంగా మార్చుకొని కొన్ని కార్పోరేట్ సంస్థలు ఎలా సొమ్ము చేసుకుంటున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. దేవుడ్ని నమ్మిన మనిషి, అతడు చేసే అద్భుతాల్ని కూడా నమ్ముతాడు అని సినిమాలో ఒక డైలాగ్ ఉంది. తమకున్న రోగాల్ని.. సాక్షాత్తూ ఆ దేవుడే రూపుమాపుతున్నాడు అనే భ్రమలో వారిని ముంచి తేల్చడమే.. కొందరు పాస్టర్లు మిరాకిల్స్ పేరుతో చేస్తోన్న వ్యాపారం. ఆ పాయింట్ ను చాలా స్పష్టంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ అన్వర్ రషీద్.
30 నుండి 40 శాతం వరకూ క్రైస్తవం ఉన్న కేరళ లో ఇలాంటి ఒక సినిమాను చిత్రీకరించి, విడుదల చేసే సాహసం చేయడం సాధారణ విషయం కాదు. ఆ విషయంలో దర్శక, నిర్మాతల గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. విజు ప్రసాద్ గా ఫహద్ ఫాజిల్ నటన సినిమాకే హైలైట్. మతిస్థిమితం లేని తమ్ముడిగా శ్రీనాథ్ భాసి అదరగొట్టాడు. అలాగే .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర పోషించిన తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ నటన కూడా అలరిస్తుంది. ఇంకా ఇతర పాత్రలు పోషించిన దిలీష్ పోత్తన్, చంబన్ వినోద్ ల నటన కూడా బాగుంటుంది.
ఒక్కమాటలో : ఎవరి మతం వారికి గొప్ప. ఎవరి దేవుడ్ని వారు ఎంత గొప్పగానైనా ఆరాధించవచ్చు.. పూజించవచ్చు. అయితే ఆ మతం ముసుగులో అమాయక ప్రజల్ని మోసం చేయడం , వారి బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం మాత్రం .. ఆ దేవుడ్నే మోసం చేయడమంత తప్పని ఈ సినిమా చాటి చెబుతుంది.
ఎక్కడ చూడాలి?: ఆహా
నటీనటులు : ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీం, శ్రీనాథ్ భాసి, చంబన్ వినోద్, దిలీష్ పోత్తన్, శ్రిండ, గౌతమ్ మీనన్ తదితరులు
సాంకేతిక నిపుణులు : కెమేరా : అమల్ నీరద్, సంగీతం : జాక్సన్ విజయన్, సుశిన్ శ్యామ్
నిర్మాణం : అన్వర్ రషీద్
భాష : తెలుగు
రేటింగ్ : 3/5