దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నా టీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారో క్లారిటీ రావడం లేదు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులతోపాటు మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి ఈ టికెట్‌ను ఆశిస్తుండడం అధినేత కేసీఆర్‌కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఓ కొత్త పేరును కేసీఆర్ తెరపైకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
ఆ అధికారికే అవకాశం..
వాస్తవానికి ఈ టికెట్ సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులకే దక్కుతుందని అంతా భావించారు. కానీ.. ఆయన కుమారుడు సతీశ్ రెడ్డి వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారడంతో కేసీఆర్ ప్లాన్ మార్చుకున్నారట. అలా అని.. ముత్యంరెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చినా పార్టీపరంగా నష్టమే జరుగుతుందని అంచనాకు వచ్చిన గులాబీ బాస్.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించాలని ఆలోచిస్తున్నారట. గతంలోనే వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు.
హుస్నాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా టికెట్ దక్కలేదు. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగడం ఖాయమని ప్రచారం జరిగినా చివరి క్షణంలో చేజారింది. వెంకట్రామిరెడ్డిపై కేసీఆర్‌కు ఎప్పటినుంచి సదాభిప్రాయం ఉంది. గతంలో చాలా వేదికలపై వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ పొగడ్తల్తో ముంచెత్తారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లోని అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో వెంకట్రామిరెడ్డే పర్యవేక్షిస్తుంటారు.
శ్రీనివాసరెడ్డి అసమ్మతి స్వరం..
ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అధికార పార్టీ ఎమ్మెల్సీ పదవిని ఆశ చూపిస్తున్నా ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన పట్టుబడుతున్నారట. టికెట్ దక్కని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని శ్రీనివాసరెడ్డి గట్టిగా నమ్ముతున్నారట. టీఆర్ఎస్ టికెట్ దక్కని పక్షంలో ఆయన బీజేపీ గూటికి చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎవరు పోటీ చేసినా గెలిపిస్తాం..
ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీష్ రావు అన్నీతానై వ్యవహరిస్తూ అసమ్మతి స్వరం వినిపించకుండా పని చేస్తున్నారు. టికెట్ తమకేనుంటూ రామలింగారెడ్డి, ముత్యంరెడ్డి వర్గాలు ఓవైపు ప్రచారం హోరెత్తిస్తుండగా.. టికెట్‌పై కేసీఆర్‌దే తుది నిర్ణయమని హరీష్‌రావు స్పష్టం చేస్తున్నారు. అధికార పార్టీ తరఫున ఎవరు బరిలోకి దిగినా విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నిర్దేశించిన లక్ష మెజార్టీ సాధిస్తామని చెబుతున్నారు.
కేసీఆర్ వస్తారా..?
ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ తరఫున సీఎం కేసీఆర్ వెళ్తారా? వెళ్లరా? అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా నేపథ్యంలో భారీ బహిరంగ సభల నిర్వహణ అసాధ్యం. ఈక్రమంలో కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పాలేరు, హుజూర్ నగర్‌కు కేసీఆర్ వెళ్లకపోయినా గులాబీ పార్టీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని ఆ పార్టీ నేతలు జోస్యం చెబుతున్నారు.
ప్రధాన పార్టీల ప్రచార పర్వం..
ఉప ఎన్నిక నగారా మోగిడంతో ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించనప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావు తనకే టికెట్ దక్కుతుందన్న ధీమాతో ప్రచారాన్నిముమ్మరం చేశారు. దుబ్బాకలో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. గట్టి అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది. మరోవైపు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆల్ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ మద్దతుతో ఆమె పోటీచేస్తున్నారు











