దుబ్బాక ఎన్నికలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. జనాలు కూడా ఈ ఎన్నికల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అక్కడ ఎవరు గెలవబోతున్నరనే అంశం వారిలో ఉత్సుకతను కలిగిస్తోంది. ఇక్కడ ఎంతమంది పోటీలో ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ వర్సెస్ రఘునందన్‌రావు మధ్య మాత్రమే ఉండనుంది. వాస్తవంగా దుబ్బాక నియోజకవర్గంల 2004 నుంచి టీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంటూ వస్తోంది. సోలిపేట రామలింగారెడ్డి 2004, 2008 ఉప ఎన్నిక్లో గెలివగా 2009లో మాత్రమే ఓడిపోయారు. మళ్లీ తిరిగి 2014, 2018 ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీయే అభ్యర్థిగా రామలింగారెడ్డే విజయం సాధించారు. ఇక్కడి ఓటర్లు గులాబీ పార్టీకే పట్టంకడుతూ వస్తున్నారు. అయితే రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీకి ఇంత ట్రాక్ రికార్డున్నా ఈ ఉప ఎన్నికల్లో ఎక్కడ పట్టు సడలిపోతుందోనని గులాబీ పార్టీ ఆందోళన చెందుతోంది. తమ సిట్టింగ్ స్థానం జారిపోకుండా ఉండేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి దుబ్బాక ఎన్నికల గెలుపు బాధ్యతలు తనమీద వేసుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపడుతున్నారు.
అయితే ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్‌ను 15 ఏళ్లలో నాలుగు సార్లు గెలిపించినా దుబ్బాక మాత్రం అభివృద్ధిలో వెనకపడే ఉంది. దుబ్బాకకు పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు అభివృద్దిలో దూసుకుపోతుంటే దుబ్బాక మాత్రం ఎందకంతలా వెనుకబడిపోయిందనే ప్రశ్న నియోజకవర్గ ఓటర్లల్లోనూ మెదులుతోంది. ఈరకంగా స్థానిక ప్రజల్లో తెరాసపై అసంతృప్తి కూడా కాస్త ఉంది.
పట్టువదలని విక్రమార్కుడు..
బిజెపి తరుపునుంచి దుబ్బాకలో రఘునందన్‌రావు పోటీలో నిలవడం దాదాపు ఖాయమైనట్లే. తను కూడా ఎప్పటి నుంచో ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పార్టీ పటిష్టత కోసం 2014 ఎన్నికలకు ముందు వరకు ఎంతో కృషి చేశారు. ఆ టైంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన రఘునందన్ 2014 ఎన్నికల్లో తెరాస సీటు ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ చేసి దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లోనూ ఆయన మరోసారి దుబ్బాక నుంచే పోటీ చేసి ఓడారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెదక్ ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రఘునందన్‌రావు గత కొన్నేళ్లుగా ఓడినా, గెలిచినా నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నారు. వరుసగా ఓటమి పాలవుతున్నా కానీ పట్టువదలని విక్రమార్కుడిలా మెదక్ జిల్లా నుంచే పోరాడుతున్నారు. తెరాసకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో బిజెపి పార్టీ పటిష్టత కోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారు.
సానుభూతి, అసంతృప్తి పనిచేసేనా..
ఎంఎల్ఏగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా వరుస ఓటమలు చవిచూసినా కూడా అటు మెదక్ జిల్లాను, ఇటు దుబ్బాకను మాత్రం వదలకపోవడం ఈ సారి రఘునందన్ రావుకు కలిసి వచ్చే అంశంగా జనాలు చర్చించుకుంన్నారు. ఈ సానిభూతే ఆయనకు బాగా కలసివచ్చే అంశంగా కనబడుతోంది. ఈ సారి ఎలాగైనా తెరాస కంచుకోటలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఉప ఎన్నికపై బిజెపి నాయకత్వం కూడా దృష్టి సారించింది. ఇప్పటికే రాజాసింగ్ తో పాటు కొంతమంది రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి నేతలను ప్రచారంలోకి దింపారు. మరికొంత మంది నేతలు కూడా దుబ్బాక ప్రచారంలో పాల్గొననున్నారు. దుబ్బాక అభివృద్ధిపై ఓటర్ల అసంతృప్తి, రఘునందన్‌పై సానుభూతి ఈ రెండు అంశాల ప్రభావం తెరాసపై కచ్చితంగా పడే అవకాశం ఉందదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ఎన్నికల్లోనైనా రఘునందన్ గెలుస్తాడో లేదో చూడాలి మరీ.











