కవిత ఎమ్మెల్సీగా గెలిచింది. ఇది అందరూ ఊహించిన విజయమే. మరీ నెక్ట్స్ ఏంటీ అనే చర్చ సర్వత్రా మొదలైంది. కవితకు ఇక క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అయిందని కవిత వర్గం అంటుంటే.. మరికొందరు అప్పుడే కవితకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. అసలు కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్ర పాలిటిక్స్‌లో హాట్‌టాపికైంది.
పోర్ట్‌ఫోలియోపై చర్చ…
రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా కవిత పోటీలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతోపాటు, పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా ఉండేది. కానీ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపిగా ఓటమి చవిచూశాక రాజకీయంగా కవిత సైలెంట్ అయిపోయారు. సరిగ్గా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనేది కాదు. ఒక్క సారిగా ఆమె యాక్టివ్ రాజకీయాల్లో సైలెంట్ అయిపోవడంతో నిజామాబాద్ క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది. అనుచరులు, కార్యకర్తల ఒత్తిడి, కోరిక మేరకు మళ్లీ తను చట్ట సభల్లో అడుగుపెట్టాలని భావించి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకుంది. అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభల్లో అడుగుపెట్టబోతుంది. ఈమె విజయంతో తన అనుచరులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక తమ నాయకురాలికి మంత్రి పదవి రానుందని అప్పుడే జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఏ పోర్ట్‌ఫోలియో దక్కుతుందోనని ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఆ అవకాశం ఉందా?
ఎమ్మెల్సీగా కవిత గెలుపుపై మొదటి నుంచి ఎవరికీ సందేహాలు లేనప్పటికి, ఆమెకు మంత్రి పదవి దక్కుతుందా? ఒకవేళ దక్కితే ఏ శాఖ దక్కనుంది? అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్లో మొదటి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అసెంబ్లీ శాసన సభ సభ్యుల దామాషా లెక్కల ప్రకారం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య 18 మందికి మించరాదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిఎంతో కలిపి 18 మంది సభ్యులు మంత్రివర్గంలో ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే క్యాబినెట్‌లో ప్రస్తుతం ఖాళీల్లేవని చెప్పాలి. ఈతరుణంలో కవితకు మంత్రివర్గంలో చోటు ఎలా దక్కుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రాజీనామా చేస్తారా?
కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరైనా ఒకరు తమంతటతాముగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వం ఏ సభ్యున్నైన్నా తొలగించాల్సి ఉంటుంది. అప్పుడుగానీ కవితకు మార్గం సుగమం కాదట. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఎవరికి ఉద్వాసన పలుకుతారు? ఒక వేళ తొలగించినా ఆ వర్గం నుంచి పార్టీలో లుకలుకలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదికాకుండా మరే ఇతర మార్గాన్నేమైనా గులాబీ బాస్ అనుసరించే వీలుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. కవితకు మంత్రి పదవి ఇవ్వడం ఇప్పటికిప్పుడు జరిగేపనికాదని తెలుస్తోంది. మరికొంత సమయం వేచిచూడాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ మంత్రి పదవి కట్టబెట్టడం సాధ్యం కానిపక్షంలో క్యాబినెట్ హోదా ఉన్న పదవిని కట్టబెడుతారనే ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కవితకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందో లేదో తెలియాలంటే కొంత సమయం వేచిచూడాల్సిందే.