తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన వైపు వెళ్ళి చాలా రోజులైంది. రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ వద్ద సమస్యలు విన్నవించుకోవడం కామన్. అయితే కేసీఆర్ మాత‌్రం ఇందుకు విరుద్దం. ఎన్ని సమస్యలు వచ్చినా రాష్ట్రం దాటి వెళ్ళడం లేదు. రాష్ట్రంలో కూడా ప్రగతి భవన్ నుంచే సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నారు.
అధికారులు, మంత్రుల నుండి సమాచారం తెప్పించుకుని సహాయక కార్యక్రమాలపై ఆరాతీస్తున్నారు. సమస్యల సత్వర పరిష్కారం కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఆర్థిక భారం పడే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తన డిమాండ్లను విన్నవించుకుంటున్నారు.
అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళక పోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత కేంద్రంతో అంత సఖ్యత లేదు. అంతే కాకుండా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై కేసీఆర్ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రతి అంశంపై కేంద్రం జోక్యం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్ర హక్కులను కాలరాస్తోంది… రాష్ట్రాలకు స్వేచ్చనివ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు 2019 సాధారణ ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశాన్ని చుట్టి వచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో ఎన్డీఏ, యూపీఏ యేతర పార్టీలను జట్టుకట్టించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఆయన రాష్ట్రం దాటి పెద్దగా బయటకు వెళ్ళడం లేదు. కొన్ని రోజుల కిందట క్యాబినెట్ మంత్రులు కొంత మంది ఢిల్లీ వెళ్ళి వచ్చినా దానికి పెద్దగా ప్రచారం కల్పించుకోలేదు.
రాష్ట్రం అనేక విపత్తులను ఎదుర్కొంటోంది. కరోనా కాలంలోనూ ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాత్రమే మాట్లాడారు. ఆ తరువాత ఢిల్లీ వైపే పట్టించుకోలేదు. పీఎం మోడీతో మాట్లడనేలేదు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి వీలు చిక్కినప్పుడల్లా ఢిల్లీ వెళ్ళి వస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులతో సమావేశం అయ్యి సమస్యలను చెప్పుకుంటున్నారు. దీంతో కేసీఆర్ తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది.
తాజాగా వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. గ్రేటర్ హైదరాబాద్ మొత్తాన్ని ముంచెత్తినా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళలేదు. అధికారులు, మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రం వర్షాల కారణంగా 5వేల కోట్ల రూపాయాలు నష్టం వాటిల్లిందని .. తక్షణం 13వందల కోట్లు సాయం చేయాలంటూ లేఖరాసారు. రాష్ట్ర రిపోర్టు ఇవ్వకుండా సాయం ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు బీజేపీ నేతలు. ఇంతటి విపత్తులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవనే దాటకుండా సమీక్షలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ప్రగతి భావన్ దాటి బయటకు వచ్చింది.. నాయని నర్సింహారెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించడానికి మాత్రమే.
తనకు నచ్చని వారిని తన దరిదాపులకు కూడా రానివ్వని కేసీఆర్ ప్రధాని మోడీతో ఎప్పుడు సమావేశం అవుతారు. సీఎం ఢిల్లీ యాత్ర అనేది ఇప్పట్లో ఉంటుందా? లేదా అన్న అనుమానం ప్రజల్లో కలుగుతోంది.










