గ్రామ సచివాలయంలో మహిళా వాలంటీరుగా పనిచేస్తున్న అమ్మాయిపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సదరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడి మీద గతంలోనే ఆరోపణలున్నాయి. వ్యవహారం పోలీసుకేసు దాకా వెళ్లింది కూడా. అప్పట్లోనే అరెస్టు అయ్యాడు. తాజాగా ఆ అమ్మాయి రెండురోజులుగా కనిపించడం లేదు. ఫోను పనిచేయడం లేదు. సదరు వైసీపీ నేత మొబైల్ కూడా స్విచాఫ్ వస్తోంది? ఏం జరిగినట్టు? చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారుతున్న విషయం ఇది.
పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీలో ఓ యువతి వాలంటీరుగా విధులు నిర్వర్తిస్తోంది. గురువారం నాడు ఆఫీసుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారు పడి ఆరా తీశారు. ఆమె ఫోను పనిచేయడం లేదు. వారికి భయంతో పాటు అనుమానం వచ్చింది.
కొంత కాలం కిందట ఆమె పట్ల స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీకి జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి అయిన శ్రీనివాసులు అసభ్యంగా ప్రవర్తించాడు. అనుమానంతో అతని ఫోన్ కు ట్రై చేశారు. అది కూడా స్విచాఫ్ వచ్చింది.
దీంతో ఆ యువతి తల్లిదండ్రులు వైసీపీ నేత శ్రీనివాసులు, ఆయన భార్య శ్రీదేవి, మరో ఆరుగురు అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలోనే అరెస్టయిన శ్రీనివాసులు ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ప్రమాదం జరిగుంటుందా?
అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ నేత శ్రీనివాసులుపై, వాలంటీరుగా పనిచేస్తున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసి అతని అరెస్టుకు కారణమైంది. బెయిల్ పై వచ్చిన అతను ఆమెపై కక్ష పెంచుకుని ఏమైనా అపాయం తలపెట్టి ఉండవచ్చా అనే దిశగానే అందరిలోనూ భయం ఉంది. పోలీసులు కూడా ఈ కోణంలోంచే దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది. పోలీసులు వెంటనే చొరవ తీసుకుని వెతికితే తప్ప.. తమ అమ్మాయి దక్కకుండా పోతుందేమోనని కూడా వారు ఆందోళన చెందుతున్నారు.











