పోలియోకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన మొదటి బృందానికి నాయకత్వం వహించిన జోనాస్ సాల్క్ పుట్టిన రోజును (అక్టోబర్ 24)న ప్రపంచ పోలియో దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనిని పది సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ స్థాపించింది.
ఆల్బర్ట్ సబిన్ తరువాత మరింత అభివృద్ధి చేసిన పోలియో వైరస్ వ్యాక్సిన్ ను విస్తృతంగా వాడుకలోనికి తీసుకుని వచ్చింది డబ్ల్యూహెచ్ వో. ఈ వ్యాక్సిన్ ను వినియోగంలోకి తీసుకుని వచ్చిన తరువాత 1988లో గ్లోబల్ పోలియో నిర్మూలన ఇనిషియేటివ్ (GPEI)ను స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 99 శాతం పోలియో నిర్మూలన అయినట్లు జీపీఈఐ తెలిపింది.
అసలు పోలియో అంటే ఏమిటి?
పోలియో అనేది ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. పోలియో అనేది అశుభ్రమైన ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులోనికి ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఈ వైరస్ క్రిములు శరీరంలోని వ్యర్థాల ద్వారా బయటకు వచ్చినప్పుడు వాటి మీద ఈగలు వాలి అవి మళ్లీ ఆహార పదార్థాల మీద వాలడం వల్ల ఆహారం కలుషితం అయ్యి వ్యాధి సంక్రమిస్తుంది. ఈ క్రిములు రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.
కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి క్రిములు ఒక సారి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్దిపొందుతూ, క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడీ మండలం దెబ్బతిని కదల్చడానికి వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి.
ఈ క్రిములు శరీరంలో ప్రవేశించి అసంఖ్యాకంగా వృద్ధిపొందడం మొట్ట మొదటి దశ. రెండవ దశలో నాడీ మండలానికి వ్యాధి సోకుతుంది. దీని వల్ల కండరాలు కదల్చడానికి వీలు లేకుండా బిగుసుకుపోతాయి. దీని వలన కండరాలు కుచించుకుపోయి, ఆ శరీర భాగం పనిచేయడం మానేస్తుంది.
నివారణ మార్గాలు..
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పోలియో వ్యాధి దాదాపు తగ్గిందనే చెప్పవచ్చు. ఒక వేళ ఏదైనా ఉన్నా.. దానిని కూడా తగ్గించడానికి మన వంతు సాయం కూడా అందించాలి. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన పోలియోతో పాటు అనేక వ్యాధులను రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
చిన్న పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు పోలియో మందును చుక్కల రూపంలో అందిస్తారు. వీటిని క్రమం తప్పకుండా వేయడం వల్ల పోలియోను ఆరికట్టవచ్చు.