హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన కుమార్తె చేసిన చిన్న ట్వీట్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై న్యూస్ వైరల్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత ఆమె తన తప్పును సవరించుకుంటూ వెంటనే మరో ట్వీట్ చేసింది. దీంతో ఫిలిం నగర్ లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇలా రకరకాలుగా వార్తలు వెలువడుతున్నాయి. రాజశేఖర్, జీవిత దంపతులతో పాటు వారి కుమార్తెలిద్దరూ కూడా కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కుమార్తెలు కోలుకున్నారు. వీరంతా అపోలో ఆస్పత్రిలో ఓ గదిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
జీవిత కూడా పూర్తిగా కోలుకున్నారని తెలిసింది. హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి మాత్రం నిన్నటి మీద ఈరోజు కాస్త మెరుగుపడిందని సమాచారం. ముఖ్యంగా ఆయన బ్లడ్ లో క్లాట్స్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలోనే ఆయనకు చికిత్స జరుగుతోంది. రక్తసరఫరాను మెరుగు పరిచే దిశగా వైద్యులు కృషి చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నట్లు తెలిసింది. ఆయన ఆరోగ్యం విషయంలో వెలువడుతున్న పుకార్లలను నమ్మవద్దని కూడా జీవిత కోరుతున్నారు.











