తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ సర్కారు హాయాంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన అవసరాలకు వాడుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం లడ్డూ వ్యవహారం బయటికి రావడంతో ఆయన చేసిన అక్రమాలు మరిన్ని బయటికి వస్తున్నాయి. నిజానికి సుబ్బారెడ్డిపై లెక్కలేనన్ని ఆరోపణలు ఉండగా.. అవన్నీ నిజమే అనే భావన ప్రస్తుతం వ్యక్తం అవుతోంది. వెంకన్న సన్నిధిని సుబ్బారెడ్డి తన జాగీరుగా మార్చుకున్నారని అప్పుడే విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. అయితే, జగన్ అండతో తనకు ఎదురన్నదే లేకుండా అవకతవకలతో పేట్రేగిపోయారు.
టీటీడీ చైర్మన్‌గా ఆయన అరాచకాలకు పరాకాష్ఠ వీవీఐపీ దర్శనాల వ్యవహారంగా చెబుతారు. టీటీడీ రూల్స్ ప్రకారం చైర్మన్ కోటా కింద రోజుకు సగటున ఆరు నుంచి 12 మందికి మాత్రమే వీవీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుంది. ఒక్కో సిఫారసు లేఖపై ఆరుగురిని ఈ దర్శనాలకు అనుమతిస్తారు. వైవీ సుబ్బారెడ్డి మాత్రం.. రోజుకు సగటున 60 రికమండేషన్ లెటర్లు ఇచ్చి 364 మందికి వీవీఐపీ దర్శనాలకు వీలు కల్పించేవారు. చైర్మన్‌గా నాలుగేళ్ల కాలంలో 3,60,338 మందికి దగ్గరుండి దర్శనాలు చేయించారు. సుబ్బారెడ్డితో పోల్చితే కొద్దికాలమే భూమన కరుణాకర్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్నా కూడా.. ఆయన ఏకంగా 43 వేల మందికి ప్రత్యేక దర్శనాలు కల్పించారు. దీంతో దర్శనాల పేరుతో ఏమైనా వ్యాపారం చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టీటీడీ చరిత్రలో ఇంతలా వీవీఐపీ లేఖలు ఇచ్చిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తప్ప మరొకరు లేరు. జగన్ అధికారంలోకి రాగానే తన బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించారు. 2019 జూన్ 21 నుంచి 2021 ఆగస్టు వరకు తొలిదఫా చైర్మన్‌గా.. 2021, ఆగస్టు 8 నుంచి 2023 ఆగస్టు 27 వరకు రెండో దఫా ఛైర్మన్‌గా పని చేశారు. చైర్మన్ హోదాలో ఆయన ప్రధాన విధులు మరిచి.. లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు.
2020 ఫిబ్రవరి నుంచి కరోనా వచ్చినప్పుడు మొత్తం లాక్ డౌన్ విధించారు. 2021లో కాస్త సడలించినప్పుడు భౌతికదూరంతో కూడిన దర్శనాలను అనుమతించారు. ఈ సమయంలో కూడా వైవీ సిఫారసుల దర్శనాలు సాగాయంటే.. అది వ్యాపారమే అయి ఉంటుందని అందరూ అంటున్నారు. కోటా, పరిమితులు, నియమనిబంధనలు పట్టకుండా తోచినట్లుగా సొంత మనుషులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పించారు. ఆయన ప్రత్యేక దర్శనాల పేరుతో వ్యాపారం చేశారా? సిఫారసు లేఖలకు ధరకట్టి అమ్ముకున్నారా? అన్న అనుమానాలు ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి.











