తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో మరో భారీ పరిణామం జరిగింది. కల్తీ సప్లై చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఆవు నెయ్యిని జగన్ హాయాంలో వారే సరఫరా చేశారు. దీంతో భారత ఆహార భద్రత ప్రమాణాల విభాగం నోటీసులు పంపింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించగ.. నాణ్యత పరీక్షలో ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి చెందిన నెయ్యి విఫలమైనట్లు ఆ నోటీసుల్లో పేర్కొంది. గత శుక్రవారం నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఏఆర్ ఫుడ్స్‌తో పాటు మరికొన్ని సంస్థలకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థల సమాధానం, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు వచ్చిన తర్వాత.. వాటిపై చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది.
ఏఆర్ ఫుడ్స్‌లో గతవారం తనిఖీలు కూడా జరిగాయి. అయితే, ఏఆర్ డెయిరీ మాత్రం.. తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని చెబుతోంది. తాము మంచి నెయ్యినే పంపించామని.. క్వాలిటీ చెక్ చేశాకే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందని చెబుతోంది. తాము 30 ఏళ్లుగా నమ్మకమైన వ్యాపారం చేస్తున్నామని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇచ్చారు. ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధమంటూ వారు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోన ఏఆర్ డెయిరీకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశం అయింది. తమిళనాడులోని దిండుక్కల్ కేంద్రంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పని చేస్తుంది.
మరోవైపు, ఇంకోసారి ఇంత పెద్ద తప్పిదం జరగకుండా తిరుమలలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రెడీ అయింది. 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ద్వారా తిరుమల అధికారులతో ఒప్పందం చేసుకోనున్నారు. తిరుమలలో ప్రస్తుతం ఓ ల్యాబ్ ఉన్నా కూడా దాని పరీక్షలు మరింత పటిష్ఠంగా లేవు. అందుకే తిరుమలకు సరఫరా అయ్యే సరకుల నాణ్యత పరీక్షించడం కోసం వ్యవస్థను పకడ్బందీగా మర్చనున్నారు.
తిరుమలలో అన్నదానం, లడ్డూ, ఇతర అవసరాల కోసం రూ.800 కోట్లతో నెయ్యితో పాటు 30 నుంచి 40 రకాల వస్తువుల్ని టీటీడీ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే వీటి నాణ్యత పరిశీలించేందుకు సరైన వ్యవస్థ లేదు. తాజాగా ఘటన జరిగినందున ఒక ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ల్యాబ్‌కు సంబంధించి రూ.9 కోట్లతో అత్యాధునిక యంత్రాలు, రూ.6 కోట్లతో మరిన్ని పరికరాలు, రూ.5 కోట్లతో మైక్రోబయాలజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ల్యాబ్ ఏర్పాటుకు 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి అనుమతులు వచ్చినా.. గత గన్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.