పునాదులు కదిలిపోతున్నప్పుడు..అడుగు జారిపోతున్నప్పుడు..ఆత్రం, ఆవేదన, ఆక్రోశం సహజంగానే వస్తుంటాయి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలక పక్షం అయిన వైసిపి లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యల పై సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించే దిశగా చర్చ నిర్వహించాలని నిర్ణయించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే ఈ ప్రకటన విడుదల అయిన కొద్ది గంటలల్లోనే పెను సంచలనం రేకెత్తించింది. ముఖ్యంగా సబ్ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే చర్చలోని అంశాల్లో ఏపీకి విభజన హామీల్లో ఒకటైన అందులోనూ ముఖ్యమైన ప్రత్యేక హోదా కూడా ఒక అజెండాగా కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసిన ప్రకటనలో పొందుపరిచి ఉంది. అయితే ఇదే ప్రస్తుత వివాదానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు.
కేంద్రం నుంచి ఈ ప్రకటన విడుదల అవుతూనే ఏపీమొత్తం హోరెత్తిపోయింది. సామాజిక మాధ్యమాలు, అధికార పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.ప్రత్యేక హోదాపై వైసిపి పోరాటానికి సమాధానం రాబోతోందని, ఇదంతా తమ అధినేత వైఎస్ జగన్ ఘనత అంటూ వైసిపి నేతలు సైతం ప్రెస్ మీట్ లు పెట్టి ఊదరగొట్టేశారు.
అయితే సోషల్ మీడియాలలో వచ్చిన వార్తలు ఆధారంగా పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు సైతం తొందరపడి విచక్షణ లేకుండా స్పందించడం అనేది వైసిపి ప్రభుత్వం యొక్క అనుభవ రాహిత్యాన్ని, వారి డొల్లతనాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.
నిజానికి 2014లో అనుభవమే ప్రాతిపదికగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరని నమ్మి ప్రజలు చంద్రబాబును ఆశీర్వదించారు.మరి 2019లో ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల ముందుకు వచ్చిన వైకాపాని చూసి అద్భుతాలు సృష్టిస్తుందని ఆశించి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే ఏ ప్రాతిపదికన తమకు అవకాశం కావాలని జగన్ సర్కారు కోరుకుందో, ఆ ప్రాతిపదికను బాధ్యతతో, సంయమనంతో, పూర్తి స్థాయి విచక్షణతో నిర్వర్తించడంలో విఫలమైందని చెప్పక తప్పదు. ఇందుకు కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న సబ్ కమిటీ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై చర్చ జరగబోతోందన్న వార్త పై వైసిపి స్పందించిన తీరే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా ఆలోచించదగ్గవి స్పష్టంగా కనిపోయిస్తున్నాయి. ఒకటి ప్రత్యేక హోదా అంశం అనేది హోంశాఖ పరిధిలో లేనిది, దీనిని గుర్తించడంలో వైకాపా గణం విఫలమయ్యిందనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.ఇకపోతే అసలు సమావేశం జరగనున్నది కేంద్ర హోంశాఖ పరిధిలోని ఓ సబ్ కమిటీ ఆధ్వర్యంలో, అయితే అక్కడ చర్చ జరిగినా వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి ? ఆ సబ్ కమిటీ ఇచ్చే సిఫార్సులు ఏ మేరకు ముందుకు వెళతాయి అనేది రెండో అంశం.కాగా ఈ రెండు అంశాలపై కనీస రాజకీయ, పరిపాలన లేదా రాజ్యాంగ పరమైన పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఈ వార్తలోని డొల్లతనాన్ని, బేలాతనాన్ని గుర్తించక తప్పదు.వీటిని కూడా పరిగణించని వైకాపా అదిగో పులి అంటే ఇదిగో తోక అనేలా స్పందించిన తీరే వారి అనుభవ రాహిత్యాన్ని , వాళ్ళ పరిపాలన పరమైన డొల్లతనాన్ని స్పష్టంగా బయటపెట్టింది.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరును కూడా ఒకసారి చెప్పుకోక తప్పదు.కేంద్ర హోంశాఖ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి టిడిపి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఎక్కడా స్పందించలేదు.అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఈ మొత్తం వ్యవహారాన్ని ఆచితూచి పరిశీలించింది ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వమే అనేది స్పష్టంగా అవగాహన అవుతుంది.
ఇక కేంద్ర హోంశాఖ నుంచి ప్రకటన వెలువడి, అది సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్న తరుణంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహ రావు ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ పరిధిలోని కీలకమైన అధికారులతో తాను మాట్లాడానని, ఇలాంటి అంశం ఏది తమ అజెండాలో లేదని వారు తెలిపారని ఆయన తన స్పష్టమైన ప్రకటనను వీడియో సందేశం రూపంలో విడుదల చేశారు.
అయితే జి.వి.ఎల్. ప్రకటన తర్వాత వైసిపి నేతల వాదనలో కొత్త మార్పు కనిపించింది. కేంద్ర హోంశాఖ సబ్ కమిటీ సమావేశ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడం వెనుక టిడిపి, బిజెపి కుట్ర చేశాయనే వాదనని తెరపైకి తెచ్చింది.
అయితే ఇక్కడ ఆలోచన చేయాల్సిన అంశం ఒకటి ఉంది. గడిచిన రెండున్నర ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి సమర్ధిస్తూనే వస్తోంది. ముఖ్యంగా CAA, NRC, వ్యవసాయ చట్టాలు వంటి అన్ని అంశాలను జగన్ సర్కారు అలాగే వైసీపీ ఎంపిలు పార్లమెంట్ లో సైతం బీజేపీకి వంత పాడుతూనే ఉన్నారు. అటువంటి సహృద్భావమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్ కు చెందిన ఎంపిలను కాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా ? అసలు నిర్ణయం తీసుకునే అవకాశం ఏ మేరకు ఉంది అనే ఆలోచన కూడా మర్చిపోయి కుట్ర కోణం దాగుంది అంటూ చేస్తున్న ప్రచారంతో వైకాపా తమ చేతకాని తనాన్ని తామే బయటపెట్టుకుంటున్నట్లు అయ్యింది.
అసలు కేంద్ర హోంశాఖ పరిధిలోని సబ్ కమిటీ తో జరగబోయే సమావేశానికి సంబంధించిన అజెండా ను తయారు చేయడంలో, అలాగే మార్పు చేయడంలో నిర్ణయం తీసుకోగలిగేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే. అలాంటి అమిత్ షా ను ప్రభావితం చేసే శక్తి వైసిపికి లేదని అది ఒక్క టిడిపికి , టిడిపి నుంచి బిజెపిలోకి వెళ్లిన ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులకు ఉందని వైసిపి ప్రకటనల సారాంశం బట్టి అర్ధం అవుతోంది. అంటే తెలుగుదేశం, బిజెపి ల సాన్నిహిత్యం ఇంకా బలంగానే కొనసాగుతోందని తాము ఏమీ చేయలేకపోతున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని ఈ వాదన ద్వారా వైసిపి ఒప్పుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా వైకాపా నేతలు తమ ప్రకటనల వాగాడంబరాన్ని కొంత తగ్గించుకుని సంయమనాన్ని పాటించి ఆలోచనకు, విచక్షణకు పెద్దపీట వేసి ఉన్నటువంటి పరిపాలన సంబంధిత వ్యవహారాలపై అవగాహన పెంచుకుని తర్వాత మాత్రమే స్పందిస్తే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. తగుదునమ్మా అని ప్రతీ దానికి మైకుల ముందుకి వచ్చే నేతలు కనీస అవగాహన లేకుండా పొతే రాబోయే రోజుల్లో వైసిపి నాయకులంతా ప్రజల ముందు వాజమ్మలుగా మిగిలిపోతారనేది ఈ ఉదంతం వైకాపా కు నేర్పిస్తున్న ఒక చక్కటి గుణపాఠం.











