అబద్ధాలు చెప్పడంలో కూడా జగన్ అండ్ కో శైలి వేరు. ఒకే అబద్ధాన్ని పది సార్లు పది మంది చెప్పడం ద్వారా దాన్ని నిజం చేయాలని అనుకుంటారు. అందుకే జగన్ తో పాటుగా మంత్రులు, ఆ పార్టీ నేతలు, సోషల్ మాఫియా అంతా కలిసి పచ్చి అవాస్తవాలు పదే పదే ప్రచారం చేసుకుంటుంటాయి. రాష్ట్రానికి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామని.. నిరుద్యోగం లేనే లేదని, లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని పదే పదే చెప్పుకోవడంతో అమాయక జనం నిజమే కాబోలు అనుకొంటున్నారు. కానీ, అసలు నిజాలు సమాచార హక్కు చట్టం ద్వారా బయటికి వచ్చాయి.
సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడైన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో జగన్ సర్కారు చెబుతున్న కల్లబొల్లి కబుర్లు అన్నీ కట్టుకథలే అని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకొంది. జగన్ అధికారంలోకి వచ్చిన 2019 జూన్ 1 నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆయన చెప్పినట్టుగా లక్షల కోట్లు పెట్టుబడులు రాలేదు. లక్షల మందికి ఉపాధి అవకాశాలు అసలే దక్కలేదు. అంతా సొంత డబ్బా అని తేలిపోయింది. జగన్ ప్రభుత్వ హాయాంలో వచ్చిన పెట్టుబడులు ముఖ్యంగా 2023 మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు పారిశ్రామిక పెట్టుబడులపై కుదిరిన ఎంవోయూలపై పూర్తి వివరాలను ఆర్టీఐ సంఘం జాతీయ అధ్యక్షుడు టి.గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి రాష్ట్ర పరిశ్రమల శాఖ అరకొర సమాచారం ఇచ్చింది.
2019 జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ మొత్తం 99 ఎంవోయూలు చేసుకుంటే.. ఇవన్నీ విశాఖ సదస్సులో వచ్చినవే. వాటిలో 18 ఎంవోయూల ద్వారా రూ.5,710 కోట్ల పెట్టుబడులు, 9,150 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పరిశ్రమల శాఖ తెలిపింది. ఆ పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదు. పరిశ్రమల శాఖ కాకుండా ఇతర శాఖల్లోని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన లాంటి వివరాలు ఇవ్వనేలేదు.
అసలు విషయం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వంలో అదానీ, అరబిందో, గ్రీన్‌కో, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ తదితర సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే, జగన్ ప్రభుత్వం మళ్లీ అవే సంస్థలతో దావోస్ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు చేసుకున్నట్లుగా బయటికి వచ్చింది. పైగా ఇంకో రకంగానూ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ఎన్టీపీసీ ఏకంగా రూ.2,35,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే ఆ కంపెనీ మొత్తం మూలధనం 25 వేల కోట్లే. ఇలా చాలా కంపెనీల విషయంలో ప్రజల్ని మభ్యపెట్టింది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇవే కట్టుకథల్ని వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అదే నిజమని నమ్మించాలని చూస్తోంది.










