ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక… ఒక్క ఏపీలోనే కాకుండా తెలుగు నేల వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. విదేశాల్లోని తెలుగు ప్రజలకు కూడా అమితాసక్తిని కలిగించింది. ఎందుకంటే… ఈ ఎన్నికల్లో రికార్డు మెజారిటీ సాధించి ఇటు రాష్ట్రంలోని విపక్షాలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నోట మాట రాకుండా చేస్తామంటూ అధికార వైసీపీ నేతలు వరుసగా చేసిన ప్రకటనలు. ఈ ప్రకటనలు విన్నంతనే… నిజమే కదా… అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగాన్ని తన చేతిలో పెట్టుకుని అందిన కాడికి ఓట్లను గంపగుత్తగా దండుకుని విపక్షాలకు ముచ్చెమటలు పట్టించడం ఖాయమేనని చాలా మంది అనుకున్నారు. అదే సమయంలో విపక్షాలకు సంబంధించిన ఓటర్లు ఎవరికి వారుగా చీలిపోగా… వైసీపీకి నిజంగానే రికార్డు మెజారిటీ ఖాయమేమోనని కూడా కొందరు భావించారు. ఇది మొన్న పోలింగ్ జరిగే దాకా సాగిన విశ్లేషణలు. అయితే పోలింగ్ ముగిశాక… ఒక్కసారిగా వైసీపీ గళం మూగబోయింది. ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క నేత వాయిస్ కూడా ఇప్పుడు వినిపించడం లేదు. వెరసి పోలింగ్ సరళి… వైసీపీ వాయిస్‌ను మూయించేసిందన్న వాదనలు ఆసక్తిని రేపుతున్నాయి.
వైసీపీ నేతలు తమదైన శైలిలో ప్రకటనలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విసిరిన పంచ్‌కు రాష్ట్ర ఓటర్లు పోలోమంటూ పోటెత్తారు. 25 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 22 సీట్లు వైసీపీ ఖాతాలో పడిపోయాయి. వీటిలో తిరుపతి లోక్‌సభ కూడా ఒకటి. ఆది నుంచి కాంగ్రెస్సో, లేదంటో వైసీపీ ఖాతాలోనే పడుతూ వస్తున్న తిరుపతి స్థానం… 2019లోనూ వైసీపీ ఖాతాలో పడిపోవడం పెద్డగా ఆసక్తిని రేకెత్తించలేదనే చెప్పాలి. అయితే అక్కడి నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో ఇప్పుడు తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్రమంలో బల్లి కుటుంబానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి బదులుగా తనకు వ్యక్తిగత ఫిజియోగా వ్యవహరించిన గురుమూర్తికి జగన్ టికెట్ ఇచ్చారు. అంతేకాకుండా గురుమూర్తిని గెలిపించే బాధ్యతను కూడా వైసీపీనే తీసుకుంటుందని కూడా జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో మరోమారు వైసీపీ వేవ్ తథ్యమంటూ వైసీపీ నేతలు తమదైన శైలిలో ప్రకటనలు గుప్పించారు. తొలుత గురుమూర్తికి 3 లక్షలకు మించి మెజారిటీ వస్తుందని చెప్పిన వైసీపీ నేతలు… ఆ తర్వాత దానిని 5 లక్షలకు పెంచేశారు. మొన్న పోలింగ్ జరిగేదాకా ఇదే తరహా ప్రకటనలు వైసీపీ నేతల నుంచి లెక్కకు మిక్కిలి వచ్చాయి.

సింగిల్ ప్రకటన కూడా లేదు
మొన్న 17న పోలింగ్ ముసిగిన వెంటనే… ఎందుకనో గానీ వైసీపీ వాయిస్ మొత్తంగా మూగబోయింది. ఏ ఒక్క వైసీపీ నేత నుంచి కూడా సింగిల్ ప్రకటన కూడా రాలేదు. ఇలా ఒక్కసారిగా వైసీపీ వాయిస్ అంతా మూగబోవడానికి గల కారణాలేమిటన్న కోణంలో ఆరా తీస్తే… ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలు ఆర్భాటంగా చేసిన మాదిరిగా గురుమూర్తికి లక్షల మెజారిటీ ఏమీ వచ్చే అవకాశాలేమి లేవని, వైసీపీ దొంగ ఓట్ల మంత్రాన్ని గనుక ఆశ్రయించి ఉండకపోయి ఉంటే… మెజారిటీ మాట దేవుడెరుగు ఏకంగా ఓడిపోయేవారన్న విశ్లేషణలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇందుకు సంబంధించి గణాంకాలను తీసి మరీ సాగుతున్న విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయాయి.
పోలింగ్ తగ్గడంతో..
ఈ లెక్కలు ఎలాగున్నాయన్న విషయానికి వస్తే.. వైసీపీ గాలి వీచిన సమయంలో అంటే… 2019 ఎన్నికల్లో తిరుపతి బరిలో వైసీపీ అభ్యర్థిగా నిలిచిన బల్లి దుర్గాప్రసాదరావుకు 2.28 లక్షల మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో మొత్తంగా 79.71 శాతం పోలింగ్ నమోదు కాగా 13.16 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీ అభ్యర్థికి 7.22 లక్షల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మికి 4.94 లక్షల ఓట్లు పోలయయ్యాయి. ఈ లెక్కన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాదరావుకు 2.28 లక్షల మెజారిటీ లభించింది. మరి ఇప్పటి ఉప ఎన్నికల పోలింగ్ విషయానికి వస్తే… పోలింగ్ 63 శాతానికే పరిమితమైపోయింది. అంటే… ఎంత ఎక్కువగా లెక్కేసుకున్నా… 10 లక్షల ఓట్లు మాత్రమే పోలైనట్లు లెక్క. మరి 13 లక్షల ఓట్లు పోలైనప్పుడే వైసీపీకి 2.28 లక్షల మెజారిటీ వస్తే… ఇప్పుడు 10 లక్షలు మాత్రమే ఓట్లు పోలయితే… 5 లక్షలో, 3 లక్షల ఓట్ల మెజారిటీ సాధ్యమేనా? అన్నది అసలు సిసలు ప్రశ్నగా వినిపిస్తోంది.
ఆసక్తికర విశ్లేషణలు
అంతేకాకుండా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు, టీడీపీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ-జనసేన కూటమి గతంలో ఎన్నడూ లేనంత మేర హోరాహోరీ ప్రచారాన్ని సాగించడమే కాకుండా వైసీపీకి గట్టి షాకిచ్చేందుకు తమదైన వ్యూహాలను అమలు చేశాయి. ఈ నేపథ్యంలో గురుమూర్తికి 5 లక్షల మాట అటుంచితే… 3 లక్షలు కాదు కదా… గతంలో బల్లికి వచ్చిన 2.28 లక్షల మెజారిటీ కూడా కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా.. సైలెంట్ గా టీడీపీ వైపు ఓటర్లంతా మొగ్గు చూపినట్లుగా ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్న దరిమిలా… గురుమూర్తి ఓడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే… పోలింగ్ ముగిసిన మరుక్షణమే వైసీపీ వాయిస్ మూగబోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.











