ఆయనకు ఓటేసిన ప్రజలందరికీ ఆయన దేవుడు. ఇది జగన్ గురించి వైసీపీ నేతలు చెప్పే మాట. ఇక వైసీపీ నేతలకైతే ఆయన కరుణామయుడు, దయాసాగరుడు ఇంకా అన్నీ. కాని ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. దేవుడి స్క్రిప్ట్ ఇప్పుడు మారింది. జగనన్న కోరుకున్నట్లు కాకుండా దేవుడు స్క్రిప్ట్ మార్చి రాసేస్తున్నాడు. దాంతో వైసీపీ నేతలు ఏ స్క్రిప్ట్ ఫాలో అవ్వాలో అర్ధం కాక తడబడిపోతున్నారు. ఆ తడబాటులో పొరపాటున మనసులో మాటలే బయటికొచ్చేస్తున్నాయి. పిచ్చాపాటిగా తోటివారితో మాట్లాడుకునే మాటలే మైకు ముందు కూడా వచ్చేస్తున్నాయి. కెమెరా ముందు కంట్రోల్ అవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మొన్న విజయనగరం జిల్లాలో శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఒక స్టయిల్‌లో చెబితే.. ఇప్పుడు లేటెస్టుగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఇంకో రేంజ్‌లో చెప్పారు.
‘చాలా దారుణంగా ఉంది మా పరిస్ధితి’
వీరిద్దరు ఏం చెప్పారో తెలుసుకునే ముందు కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు జగన్ గురించి ఏం మాట్లాడారో చెబితే మీకు అసలు వీళ్లు ఇలా ఎందుకు మాట్లాడారో అర్ధమవుతుంది. ఆ కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ’’ఏం చెప్పమంటావ్ గురూ మా బాధ. ఆయన అలా మాట్లాడుతుంటే.. అలా నిర్ణయాలు తీసుకుంటుంటే పిచ్చోళ్లంలా వెనకుండి వినటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. జనం మాత్రం మమ్మల్ని ప్రశ్నలతో పొడిచి చంపుకు తింటున్నారు. చాలా దారుణంగా ఉంది మా పరిస్ధితి’’. ఇది ఆయన జగన్ గురించి మాట్లాడింది. ఇంకా మనం లాంగ్వేజ్ మార్చి రాసుకున్నాం.. ఆయనైతే స్వచ్ఛమైన కృష్ణా జిల్లా బూతుల్లో చెప్పాడు అదే విషయం.
ఆ పార్టీ వారి నోటి వెంటే..
శృంగవరపుకోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన అలా అనటం.. పక్కనున్నోళ్లంతా చప్పట్లు కొట్టడం జరిగిపోయింది. కనీసం పొరపాటు చెప్పామని తెలిసినా సవరించుకునే ప్రయత్నం జరగలేదు. అంటే ఎవరూ గమనించలేరులే ఫ్లో లో ముందుకు వెళ్లిపోతే ఏం కాదనుకున్నారేమో మరి.
ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణస్వామి అయితే జగన్ ప్రజలను దోచుకుతింటున్నారని కామెంట్ చేశారు. తర్వాత నాలిక్కర్చుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రతిపక్షాలు కుక్కల్లా మొరుగుతున్నాయని.. జనం మాత్రం విశ్వాసం ఉన్న కుక్కల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. అలా వారు రోజూ మాట్లాడుకునే మాటలనే మైకు ముందు వదిలేశారు నారాయణస్వామి.
ఏం జరుగుతోందో ఈ నాయకులందరికీ తెలుసు..
ఎందుకంటే అవినీతి ఏ రేంజ్‌లో జరుగుతోందో ఈ నాయకులందరికీ తెలుసు. పైగా వారి చేతులు కట్టేసి మరీ పైనోళ్లు దోచుకు తింటుంటే వారి కడుపు మండిపోతోంది. ఇసుక కొత్త పాలసీ అని చెప్పి.. ఇసుక మాఫియా ఒకటి రెడీ అయిపోయింది. జిల్లాల వారీగా వాటాలు పంచుకుని దోచుకు తింటున్నారు. నారాయణస్వామికి ఈ విషయం బాగా తెలుసు.. ఎందుకంటే ఆయన పెద్ద ..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డియే ఈ ఇసుక సామ్రాజ్యానికి అధినేత.
రివర్స్ టెండరింగ్ అంటూ..
ఇక పోలవరంలో రివర్స్ టెండరింగ్ అంటూ అంత మిగిల్చాం.. ఇంత మిగిల్చాం.. అని చెబుతూనే తెలివిగా వర్క్ ఫార్మెట్స్ మార్చి రేట్లు తగ్గించాయనిపించి.. మరో రూపంలో తన డియర్ కాంట్రాక్టర్ మెగా రెడ్డికి బెనిఫిట్ అయ్యేలా వర్కవుట్ చేశారు జగన్మోహన్‌రెడ్డి. అన్నిటి కంటే హైలెట్ ఏంటంటే మద్యపాన నిషేధం అని చెప్పి.. మద్యం వ్యాపారం సొంతంగా రాష్ట్రమంతా మోనోపలిగా చేసుకుని దోచుకోవడం.. బహుశా ఇలాంటి ఐడియా ఎవరికీ వచ్చుండదు. కళ్ల ముందు ఇన్ని జరుగుతుంటే అవినీతి పాలన అనక నీతివంతమైన పాలన అని ఎలా వస్తుంది వారి నోటి వెంట.
స్పందించని రోజమ్మ
పైగా ఏ ఘటన జరిగినా జనరలైజ్ చేసేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశంపై విరుచుకుపడిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడు ఆడపిల్లలపై రోజుకో దాడి జరుగుతున్నా స్పందించే సమయం కరువైపోయింది. పాపం రోజమ్మ ఎంత బిజీగా ఉన్నారో గాని.. ఆడపిల్లలపై దాడుల గురించి అస్సలు మాట్లాడటం లేదు ఇప్పుడు. ఎప్పుడో ఆయమ్మ కూడా ఈళ్ల లాగే నోరు జారి అసలు విషయం చెప్పేస్తుందేమో.. జర చూసుకోండి జగనన్నా.